- బడులతో తల్లిదండ్రుల బంధం బలోపేతానికి ప్రభుత్వ కృషి
- దేశంలోనే తొలిసారిగా ఒకే రోజు, ఒకేసారి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలోనూ మెగా పీటీఎం 2.0
- 61,135 విద్యా సంస్థల్లో 2,28,21,454 మంది పాల్గొనే బృహత్ కార్యక్రమం
- సరికొత్త రికార్డులు నెలకొల్పనున్న మెగా పీటీఎం 2.0
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి. విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ఆలోచనతో మరో పెద్ద పండుగ పరిచయమైంది. అదే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల విద్యా సంక్రాంతి. ఏ రంగమైనా ప్రగతిపథంలో పయనించాలంటే, ఆ రంగానికి సంబంధించిన వారి భాగస్వామ్యంతోనే సాధ్యమని నమ్మే విద్యా మంత్రి లోకేష్.. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను దేశానికి దిక్సూచిగా నిలపాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. విద్యా సంస్కరణలు ఓ పక్క, సమస్యల పరిష్కారం మరోవైపు చేపడుతూనే.. విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులందరినీ బడుల బాగులో భాగస్వాములను చేయాలనే ఆలోచనకు తొలి అడుగుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం)ను 2024 డిసెంబర్ 7న నిర్వహించారు. అత్యంత ఘనంగా, ప్రయోజనాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పీటీఎం ఇచ్చిన స్ఫూర్తితో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 (మెగా పీటీఎం 2.0)కు రూపకల్పన చేశారు. పిల్లలు-వారి తల్లిదండ్రులకు బడిని మరింత చేరువ చేసేలా, విద్యాప్రయాణంలో అందరి భాగస్వామం ఉండేలా జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 (మెగా పీటీఎం 2.0) నిర్వహించనున్నారు.
ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆత్మీయ సమావేశాలు
పేరెంట్ టీచర్ మీటింగ్స్ సాధారణంగా ప్రతి విద్యాసంస్థలోనూ జరిగేవే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కొన్ని చోట్ల పీటీఎంలు జరుగుతుంటాయి. ఇవి కూడా ఏదో జరపాలి కాబట్టి…అనే విధంగా జరుగుతాయి. మొక్కుబడి కాదు, బడితో ఆత్మీయ బంధం ఏర్పడాలి అనే లక్ష్యంతో ఒకేసారి 2024, డిసెంబర్ 7న 44,956 పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎంలో 25.46 లక్షల మంది తల్లిదండ్రులు, 27,395 మంది పూర్వవిద్యార్థులు, 22,200 మంది దాతలు, 36,918 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో ఇంతటి బృహత్ కార్యం జరగడం ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిసారి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణ సత్ఫలితాలు ఇస్తుండడంతో మరింత విస్తృత పరిచేందుకు ప్రైవేటు విద్యాసంస్థలలోనూ అదే రోజు పీటీఎం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలలో ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున 61,135 విద్యా సంస్థల్లో జరిగే ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమంలో దాదాపు 2,28,21,454 మంది (74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, తదితరులు 1,49,92,456 ) పాల్గొననున్నారు.
సన్నాహక చర్యలు
‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం విజయవంతం చేయడానికి సన్నాహక చర్యలు చేపట్టాలని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆదేశాలు మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయ్ రామరాజు, ఇంటర్మీడియేట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మెగా పీటీఎం విజయవంతానికి అహరహం శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆర్జేడీలు తమ పరిధిలో జిల్లా విద్యాశాఖాధికారులు, ఏపీసీలతో, మండల విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకుని, నిశితంగా పర్యవేక్షించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు సూచనలు ఇచ్చారు.
లక్ష్యం…
పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కీలకమని పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (ఆర్‌టీఈ), జాతీయ విద్యా విధానం, 2020 (ఎన్‌ఈపీ) సూచించిన నేపథ్యంలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణలు అవసరమయ్యాయి.
ప్రయోజనాలు ..సూచనలు
పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పనిచేస్తుంది.
పీటీఎంలు తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి సహాయపడతాయి, అదే సమయంలో ఉపాధ్యాయులు.. పిల్లల ప్రయోజనం కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరడానికి వీలు కల్పిస్తాయి.
ఈ సహకార ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లను (మెగా పీటీఎంలు) వేడుకగా నిర్వహించాలని సంకల్పించింది.
మెగా పీటీఎం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధి. తద్వారా ప్రతి పిల్లవాడి ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు
ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు విద్యార్థుల సమగ్ర పురోగతి కార్డులను (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు) అందిస్తారు. తద్వారా ప్రతి బిడ్డ విద్యా పురోగతి తెలుసుకుంటారు.
ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, మౌలిక సదుపాయాల లోపాలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేస్తారు.
సరదా కార్యకలాపాలు, ఆటలు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరు తల్లిదండ్రులమధ్య స్నేహ భావాన్ని పెంపొందించవచ్చు.
విద్యార్థుల, పాఠశాలల విజయ గాథలను ప్రస్తావించి ప్రశంసిస్తారు.
గ్రీన్ పాస్ పోర్ట్
ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫోటో బూత్‌లు, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్‌లు, ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్క నాటడం) భాగంగా గ్రీన్ పాస్‌పోర్ట్‌ఉన్నాయి. గ్రీన్ పాస్ పోర్టు అంటే, ఆ విద్యార్థి నాటిన మొక్కలు, పెంపకం వివరాలు ఉంటాయి.
ఆసక్తిగల విద్యార్థులు మొక్కలు సరఫరా చేయడానికి నమోదు చేసుకోవడానికి ‘లీప్ యాప్’ అందుబాటులో ఉంది.
మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్‌లు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 (మెగా పీటీఎం 2.0) విద్యా వ్యవస్థ వికాసానికి మార్గదర్శకత్వం వహించనుంది. చదువుల పండుగలో కోట్లాది పాల్గొని విద్యా సంక్రాంతిని సందడిగా మార్చనున్నారు. విద్యాప్రయాణంలో మజిలీగా నిలిచేలా ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహణకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.