- స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్న హిందాల్కో ట్రస్ట్
- మరో మూడు సంస్థలతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందాలు
- బ్రాండ్ కుప్పంతో గిఫ్ట్ హ్యాంపర్ తయారీ
కుప్పం (చైతన్య రథం): కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1617 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. హిందాల్కో జనసేవా ట్రస్ట్ భాగస్వామ్యంతో కుప్పంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మూడేళ్లలో వెయ్యిమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు హిందాల్కో ముందుకొచ్చింది. మొత్తం 750 కుటుంబాలకు ఉపాధి కల్పించనుంది. 50మంది బంగారు కుటుంబాలను కూడా హిందాల్కో ట్రస్ట్ దత్తత తీసుకోనుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కల్పించనున్నారు. ప్రస్తుతం ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికీ రీ స్కిల్ కార్యక్రమం కింద నైపుణ్యాలను అందించనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో ఈ-ఆటోలు, ఈ-బైకులు, ఈ-స్వీపింగ్ ఎలక్ట్రిక్ మెషిన్ల తయారీ కంపెనీ స్థాపనకుగానూ ఈ-రాయస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది. తద్వారా 410మందికి ఉపాధి కలుగనుంది.
కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను ఈ-రాయస్ సంస్థ అందించనుంది. రూ.525 కోట్లతో సమీకృత పాల ఉత్పత్తుల పోషకాహార కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ -కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 7 వేలమందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పనతోపాటు స్థానిక పాడి రైతులకు ఏస్ ఇంటర్నేషనల్ సహకారం అందించనుంది. రోజుకు 7.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసేలా ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతోపాటు రూ.372.8 కోట్ల పెట్టుబడితో ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోనూ కడ ఒప్పందం చేసుకుంది. 2 లక్షలమంది రైతులకు లబ్ది కలిగేలా ప్లాంట్‌ను ఎస్వీఎఫ్ సోయా లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. 3 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఈ మూడు సంస్థలూ 2026 డిసెంబరునాటికి ఉత్పత్తి ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టనున్నారు. దీంతోపాటు కుప్పంలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా ఎస్పీడీసీఎల్ మరో ఒప్పందం చేసుకుంది. మరోవైపు కుప్పం బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్ ప్యాక్‌ను స్థానిక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త తయారు చేశారు. స్థానికంగా కుప్పంలోనే దొరికే తేనె, జాస్మిన్, రోజ్ టీ, కుప్పం గ్రానైట్, ఆవు నెయ్యి ప్యాకెట్, బాత్ పౌడర్, మిల్లెట్ కుకీస్, కుప్పంలో దొరికే సోప్ నట్స్‌తో గిఫ్ట్ హ్యాంపర్ రూపొందించారు. గిఫ్ట్ హ్యాంపర్ వస్తువులను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించి అభినందించారు.