- తప్పు చేయకపోతే పారిపోయే ప్రయత్నాలెందుకు
- మోహిత్‌రెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి కౌంటర్
అమరావతి (చైతన్యరథం): మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ ఆయన తనయుడు మోహిత్ రెడ్డి చేసిన విమర్శలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తండ్రీకొడుకులు డ్రామాలు ఆడుతున్నారని ఎక్స్ వేదికగా పులివర్తి విమర్శించారు. వైసీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం అమలు అయితే భయంతో మీ తండ్రి ఎందుకు బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ అభ్యర్థులకు మీ తండ్రే తరలించాడు. సిట్ విచారణ చేస్తుంది, నిజాలు ఏంటో బయటపడతాయి. మద్యం ముడుపులు తరలించి బిగ్‌బాస్ ఖాతాకు చేర్చింది మీ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే. మీ తండ్రి ఏ తప్పు చేయకపోతే నిజాయతీగా చట్టం ముందుకు వచ్చి సమాధానం చెప్పొచ్చుగా, పారిపోవడం దేనికి? చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుంది కాబట్టే మీరు బరితెగించి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా సహిస్తున్నామని పులివర్తి స్పష్టం చేశారు.