తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్ చరిత్ర భావితరాలకు మార్గదర్శకం అవుతుంది. ఆయన వ్యక్తి కాదు.. ఒక సంచలనం. సినీ, రాజకీయ విశ్వరూపం. సామా జిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథం, శ్రామిక జన పక్షపాతం, సమసమాజ నిర్మాణమే ఎన్టీఆర్ ఆశయం. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామన్నది ముఖ్యంకాదు.. ఆ జాతికి, ఆ ప్రాంతానికి ఏం చేశామనేది ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్ 102వ జయంతి ఉత్సవాలను తెలుగువారున్న ప్రతిచోటా జరుపుకుంటున్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 28న జన్మించారు. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుతనానికి ప్రతిరూపంగా నిలిచారు. మహానటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. సినీనటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీవినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు. సినీరంగంలో అరుదైన సుందర సాం స్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. ఒక అద్భుత కళావైభవ ప్రాభవాలను ఆవిష్కరిం చారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియ జెప్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో ఆయన రూపు చెరిగిపోలేదు. తెలుగు తెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైన, ఏడుకొండలవాడైనా ఇలా ఏ పాత్రనైనా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రలకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయన నటిస్తే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది.
సినిమాలను కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా, సందేశాత్మకంగా, సంఘర్షణాత్మకంగా మలిచారు. ప్రేక్షకులను ఆలోచింపజేసి ఆచరణకు పురిగొల్పేటట్లు ఆయన చిత్రాలు ఉండేవి. అశాంతి, అభద్రత, ఆర్థిక అసమానతలతో జీవించే ప్రజల దుర్భర పరిస్థితులను కళ్లకుకట్టినట్లు చూపించేవారు. దానవీరశూరకర్ణ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ద్వారా ఆయన నోటి నుంచి వెలువడిన మాటల తూటాలు అత్యంత సంచలనం రేపాయి. కుల, వర్ణ వ్యవస్థలే ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలుగా అభివర్ణించారు. సమాజంలో అంతరాలు సృష్టిస్తూ, అంటరానితనాన్ని ప్రోత్సహించే విధా నాలను నిరసించారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితరసాధ్యం అని చెప్పాలి. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా చాప కూడు సిద్ధాంతాన్ని ప్రబోధించారు. మరికొన్ని చిత్రాల్లో కుటుంబ నియంత్రణపై ధ్వజమె త్తారు. జనాభా పెరగడం వల్ల సంపద పెరుగుతుందని ఆనాడే చెప్పారు.
మనదేశం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. పాతాళభైరవి సినిమాతో ఎన్టీఆర్ పేరు సుస్థిరమైంది. మాయాబజార్‌లో తొలిసారి కృష్ణుడిగా నటించిప ఎన్టీఆర్ ఆ తర్వాత పాత్రలో 30కి పైగా సినిమాల్లో కనిపించి అభిమానులను అలరించారు. అలాగే శ్రీరాము డి పాత్రలో అనేక చిత్రాల్లో కనిపించారు. 1963లో విడుదలైన లవకుశ సినిమా శ్రీరాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టింది. సీతారామకల్యా ణం సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి రావణాసురుడిగా నటించి మెప్పించారు. భీష్ముడు, బృహన్నల లాంటి భిన్నమైన పాత్రలు, రావణుడు, దుర్యోధనుడు లాంటి ప్రతి నాయక పాత్రలను పోషించి మెప్పించారు. తాను ఎంచుకునే కథల్లో రైతులు, సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాలు ఉండేలా చూసుకునేవారు. కర్షకులే కాకుండా కార్మికుల కష్టసుఖాలను ఇతివృత్తాలుగా తీసుకుని నటించారు. ఈ తరహాలో నటించిన నటులు దేశంలో మరొకరు కనిపించరు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటారంటే.. అది వేరే చెప్పా లా.. ఎన్టీఆర్‌లానే ఉంటారని చెప్పుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీరంగాన్ని వీడకుండా బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవిసార్వభౌమ లాంటి చిత్రాల్లో నటించారు. తన సినీ జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణాక చిత్రాల్లో నటించి తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు.
నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో రాజకీయ ప్రవేశం చేశారు. సాంప్రదాయ రాజకీయాలను విడనాడి నూతన రాజకీయ వ్యవస్థకు, సంస్కృతికి శ్రీకారం చుట్టారు. సినీరంగంలో ఉన్నప్పుడు కూడా చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం, దివిసీమ ఉప్పెన సమయంలోనూ జోలెపట్టి ఊరూరా తిరిగి బాధితులను ఆదుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, అస్థిరత్వం నెలకొ ని ఉన్నాయి. ఉజ్వల చరిత్ర కలిగిన తెలుగుజాతి ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చా యి. ఆనాటి కాంగ్రెస్ పెద్దలు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని హస్తినాపురంలో అణాపైసలకు అమ్మకానికి పెట్టారు. ఏ క్షణం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. ప్రజాభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి తావులేదు. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం ఆవిర్భావం చారిత్రక అవసరంగా ప్రజలు భావించారు.
తన సందేశాత్మక..ఆవేశపూరిత ప్రసంగాలతో ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలపై 9 నెలలు అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా చైతన్యపరిచి భరోసా నింపారు. తెలుగువాడిలో పౌరుషాగ్ని రగిలించి జనాన్ని అదిలించి..కదిలించారు. ప్రజలను తరలించాల్సిన పనిలేదు. స్వచ్ఛందంగా మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ పగలు, రాత్రిళ్లు తేడా తెలియకుండా ఎన్టీఆర్‌ను ఒక్కసారైనా చూడాలని, ఆయన ప్రసంగం వినాలని లక్షల సంఖ్యలో హాజరయ్యేవారు. తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లంటూ నినదించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని అతి సామాన్యులను, యువ త, విద్యావంతులను ఎన్నికల కురుక్షేత్రంలో నిలిపారు. ఆయన చేసిన సాహసోపేతమైన ప్రయోగం రాజకీయ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. 294 స్థానాలు గల శాసనసభలో 202 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా గతానికి భిన్నంగా పజల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆయనే ఆధ్యుడు. కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కాగృహాలు, జనతావస్త్రాలు లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. రూ.50కే హార్స్ పవర్ విద్యుత్, వృద్ధాప్య పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎంతకాలం జీవించామనే దాని కన్నా ఎలా జీవించామన్నదే ముఖ్యం. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం తపిస్తూ అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఒక ముఖ్య మంత్రి కోసం యావత్ దేశం స్పందించింది. ఎన్టీఆర్ నెలరోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు బాసటగా నిలిచారు. ఇందిరా గాంధీ హత్యతో దేశమంతా సానుభూతి పవనాలు వీచినా 35 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. దానికి ఆయనే చైర్మన్‌గా వ్యవహ రించారు. కాలక్రమంలో ఎన్టీఆర్ వారసత్వాన్ని జాతీయస్థాయిలో చంద్రబాబు కొనసాగిం చారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీకైతే..చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచారు. ఇరువురి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని యువనేత నారా లోకేష్ కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీని అద్వితీయ శక్తిగా మలిచారు. ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథం తెచ్చారు.
తెలుగుజాతి చరిత్రను సుసంపన్నం చేసి తెలుగు ప్రజలకు గమనాన్ని, గమ్యాన్ని నిర్దే శించారు. చరిత్ర సృష్టించిన శౌర్యధనుడు, చరిత్రనే మార్చిన తెలుగువిభుండు. అందుకే తెలుగుజాతి ఉన్నంత వరకు జన హృదయాల్లో ఎప్పటికీ ఎన్టీఆర్ చిరస్మరణీయులే. ఆయన స్థానం సుస్థిరం, ఆయన కీర్తి అజరామరం. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినంగా ప్రకటించి ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వ హించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలి. అంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవించాలి.
మన్నవ సుబ్బారావు
(ఎన్టీఆర్ సినీప్రస్థానం 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలు,
102వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)