- కల్పితాలు కాకుండా వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఒకరి మెప్పుకోసం తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదు
- జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ఒంగోలు (చైతన్యరథం): ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది కీలక పాత్ర అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రకాశం జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభకి మంత్రి డోలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తోంది. మీడియా కల్పితాలు, కట్టుకథలు కాకుండా వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఒకరి మెప్పుకోసం తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని టార్గెట్‌గా చేసి తప్పుడు వార్తలు ప్రచురించడం సమాజానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు, పత్రికలు, చానళ్లు ఎవరైనా సరే విమర్శల్ని సద్విమర్శలుగా స్వీకరించాలి. అకారణంగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే యావత్ సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, జర్నలిస్టుల మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎప్పుడూ ముందుంటారని మంత్రి డోలా స్పష్టం చేశారు.