హైదరాబాద్ (చైతన్యరథం): రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమష్టిగా రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌సీఎస్‌సీఎల్) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చలు జరగాయి.
విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనం ఏపీఎస్‌ఎస్‌సీఎల్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఈ భవనంలోని 2, 3, 4, 5 అంతస్తులను తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ (టీజీఎస్‌సీఎస్‌సీఎల్)కు అద్దెకు ఇచ్చేందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించగా, ఈ అద్దె ఒప్పందంపై ఇరుపార్టీల మధ్య ఈ సమావేళంలో సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసమే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. బియ్యం ఎగుమతులను ప్రోత్సాహించి రైతులకు నష్టం లేకుండా చూస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం కింద ఒక కోటి పది లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. సమావేశం చర్చించిన విషయాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నామన్నారు. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లి రైతులకు మరింత మేలు చేకూరుస్తామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో పౌర సరఫరాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..