- టీడీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ బ్రాండ్
- దేశానికే దిక్సూచిగా చంద్రబాబు నాయుడి విజన్
- అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం విషయంలో తాత, తండ్రికి దీటుగా లోకేష్
- మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది
- పెద్దాయన ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించాలి
- నెల్లూరు మహానాడులో సోమిరెడ్డి
నెల్లూరు (చైతన్యరథం): మద్యం కుంభకోణంలో నిండా మునిగిన జగన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో అబద్ధాలను నమ్ముకుని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మహానాడులో సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రజాతీర్పు వెల్లడయిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా జరుపుతామని జగన్ రెడ్డి ప్రకటించటం హాస్యాస్పదమన్నారు. 2029లో జగన్ పార్టీకి అంత్యక్రియలు జరిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు.
మహానాడు అంటేనే నూతనోత్సాహం
మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం వస్తుందన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో నిర్వహించిన మహానాడులో నాంపల్లి నుంచి నిజాం గ్రౌండ్స్ వరకు ర్యాలీగా నడిచివెళ్లిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులతో దూబగుంట రోశమ్మ బాటలో సారా వ్యతిరేక ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నాం..అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించాను. ఉమ్మడి ఏపీలోని 22 జిల్లాలో సారా వేలం పాటలు నిర్వహిస్తే, ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం వేలం జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నాం. నెల్లూరు మహిళల పోరాట పటిమ చూసిన ఎన్టీఆర్ వీఆర్సీ మైదానంలో నిర్వహించిన సభ సందర్భంగా సారా నిషేదంతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఎన్టీఆర్ బ్రాండ్ కొనసాగుతూనే ఉంది.
అభివృద్ధి అంటే గుర్తొచ్చేది చంద్రబాబే
ఇక విజన్, హైటెక్ సిటీ, ఐటీ, అభివృద్ధి, పరిశ్రమలు అంటేనే నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఇప్పుడు మూడో తరంలో యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో పనిచేసే అవకాశం కూడా మాకు దక్కింది. పాకిస్థాన్‌తో ఇటీవల నెలకొన్న యుద్ధపరిస్థితుల్లోనూ నారా లోకేష్ కుటుంబానికి నరేంద్ర మోదీ రెండు గంటల పాటు ఆథిత్యమివ్వడం గొప్ప విషయం. లోకేష్‌లోని నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమ, అభివృద్ధి కోసం పడుతున్న తపనను మోదీ గుర్తించారని సోమిరెడ్డి అన్నారు.
అడ్డంగా దొరికి అబద్ధాలు
జగన్ రెడ్డి పాలన సాగిన ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైపోయింది. గతంలో రూ.60 కోట్ల బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కోల్పోయింది. రూ.150 కోట్ల లిక్కర్ స్కామ్‌తో ఢల్లీి సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీలు, ముఖ్య నాయకులు జైళ్లలో మగ్గిపోయారు. ఏపీలో వైసీపీ హయాంలో రూ.3200 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని సిట్ పక్కా ఆధారాలతో తేల్చింది. అధికారిక విక్రయాలతో రూ.3200 కోట్ల అవినీతి జరిగితే, అనధికారికంగా జరిపిన విక్రయాల రూపంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది. మద్యం స్కామ్‌లో అడ్డంగా బుక్కయిపోయిన పరిస్థితుల్లో మన గురించి జగన్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరం. ఉర్సా కంపెనీకి విశాఖలో 50 ఎకరాలను 90 పైసల చొప్పున ఇడ్లీ, వడ కంటే తక్కువకు ఇచ్చారని పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఆ కంపెనీకి 56.30 ఎకరాలకు ఎకరా రూ.50 లక్షల చొప్పున, 3.50 ఎకరాలను ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కంపెనీలకు ఉచితంగా భూకేటాయింపులు చేశారు. ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికవేత్తలను పిలిచి ఉచితంగా భూములిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రూ.కోటి, రూ.50 లక్షల చొప్పున భూములు కేటాయిస్తే సీఎంగా పనిచేసి వ్యక్తి ఇడ్లీ, వడలతో పోల్చి అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరం. ఉర్సా కంపెనీకి ఎకరా రూ.1కి ఇచ్చివుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, జగన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సవాల్ విసిరితే అటు నుంచి సమాధానం లేదు. ఈ రోజు దేశంలోని ఏ మద్యం కంపెనీ అయినా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం ఏపీలో ఉంది. గతంలో పరిస్థితి ఏంటి…వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడి విక్రయించిన నాసిరకమైన మందు తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. అరాచకాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రోజు గంటల తరబడి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని సోమిరెడ్డి మండిపడ్డారు.
స్థానిక ఎన్నికల్లో ఘన విజయం..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వైసీపీ హయాంలో మాదిరిగా అరాచకాలు చేయబోం. జనంలో ఉంటూ, జనం కోసం పనిచేస్తూ స్థానిక సంస్థల్లో ఘనవిజయం సాధిద్దాం. 2029 ఎన్నికల్లో తిరిగి ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడిని మరో సారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదిద్దాం. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలని తపించిన పెద్దాయన ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సోమిరెడ్డి అన్నారు.