కడప (చైతన్యరథం): మహానాడును ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సమష్టి కృషి అవసరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ తొలిసారిగా కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై మంత్రుల కమిటీ, పార్టీ నేతలతో ఆదివారం పల్లా శ్రీనివాసరావు సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, ఎంపీ దగ్గుమళ్ల, పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు ఏర్పాట్లపై నేతలు విస్తృతంగా సమీక్షించారు. మహానాడు విజయవంతం కోసం కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఏర్పాటును పకడ్బందీగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. బహిరంగ సభ, ప్రతినిధుల సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్షించింది. కడప నగరం సమీపంలోని సీకేదిన్నె మండలం పబ్బాపురంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. మూడోరోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.