- అధికారం అండతో వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు
- సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ
- అడ్డంగా దొరికిన దొంగలు నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు
- తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు
- మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ
మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తపించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా 42 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్టరీ నుండి వచ్చిన వారే అన్నారు.
కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డు సృష్టించిందన్నారు. గ్రామస్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈనెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు ప్రారంభించామని, ప్రజలకు మేలు చేయడం, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం ఏ స్థాయిలో పనిచేస్తుందో మొన్న ఓబులాపురం కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారుతో స్పష్టమైందన్నారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే వైఎస్ రాజశేర్‌రెడ్డి సహా అనేకమంది నాటి నాయకులు చంద్రబాబుపై అనేక నిందారోపణలు చేశారు. కానీ నేడు వారి దోపిడీని కోర్టు నిర్ధారించి శిక్ష విధించింది. జగన్ నా సోదరుడు అని నాడు గాలి జనార్దన్ రెడ్డి కితాబ్ ఇచ్చాడు.. ఇప్పుడు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు.
జనం చీత్కరించినా బుద్ధిరాలేదు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు, దోపిడీలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడాం. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను హరించి జగన్ రెడ్డి తన ఖజానా నింపుకున్నాడు. వేల కోట్ల విలువైన బంగారం కొనుక్కొని దాచుకున్నాడు. వారి దోపిడీ మొత్తం సిట్ విచారణలో బయటకు రావడంతో నిందారోపణలకు తరలేపారు. ప్రజలు చీత్కరించినా జగన్ రెడ్డిలో మార్పు రాలేదు. అధికారులను బెదిరించి తప్పులు చేసి ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయిస్తున్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆధారాలతో సహా దొరికిపోయిన కేసులో ప్రజల్ని మభ్యపెట్టేందుకు తన అవినీతి పత్రికను జగన్ వాడుకుంటున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. మద్యం పాలసీలు అమలులో తప్పిదాలు జరిగాయంటూ పేదల బియ్యం బొక్కేసిన దొంగ మాట్లాడడం హాస్యాస్పదం. బెల్ట్ షాపులు గురించి మాట్లాడుతున్న పేర్ని నాని అవి ఎక్కడున్నాయో చూపించాలని మంత్రి రవీంద్ర సవాల్ చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ప్రభుత్వ మద్యం షాపులు పేరుతో రాష్ట్రంలో జగన్ రెడ్డి దోపిడీకి పాల్పడితే మచిలీపట్నంలో బెల్టు షాపుల రూపంలో పేర్ని నాని ప్రజల్ని పీక్కుతిన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. కేసుల చొప్పున డిస్టిలరీ నుండి కమీషన్లు దండుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తరిమేసి కమీషన్లు ఇచ్చే కల్తీ బ్రాండ్లను మాత్రమే రాష్ట్రంలో అనుమతించారు. వాటిని మాత్రమే షాపుల్లో అందుబాటులో ఉంచారు. ఈ అక్రమాలన్నీ పరిశీలించిన తర్వాతే సిట్ అరెస్టులు చేసింది. తప్పు చేసిన వారిలో ఒక్కరిని కూడా వదిలేది లేదని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు.
ప్రజలే గుణపాఠం చెబుతారు
ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఆచరించి చూపించే తెలుగుదేశం పార్టీ సత్తా డబ్బారాయుళ్లకు ఏం తెలుస్తుందని మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు. ఎక్సైజ్ పాలసీ, మైనింగ్ పాలసీ పక్కాగా తయారు చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులకు అప్పగించారు. సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులకు ఇంత పెద్ద బాధ్యతలు ఇవ్వడం చూసి ఓర్వలేక పేర్ని నాని కడుపు మంటతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఐదేళ్లు మంత్రిగా ఉండి మచిలీపట్నంలో గజం రోడ్డు వేయని వ్యక్తి ఈ రోజు ఆరోపణలు చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నాడు. ఇప్పటికైనా పేర్ని నాని మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. లేకుంటే బందరు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.