కడప (చైతన్యరథం): మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు కడప చేరుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు విమానాశ్రయంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు (పీపీపీలు), సీనియర్ నాయకులు శనివారం ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి మహానాడు వేదికను పల్లా సందర్శించి ఏర్పాట్లపై తగు సూచనలిచ్చారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై చర్చించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సంబంధిత కమిటీలతో చర్చించి, ఏర్పాట్ల పురోగతిపై తగిన సూచనలు ఇచ్చారు. వేదిక నిర్మాణం, రవాణా సదుపాయాలు, వసతి ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహానాడు కమిటీల పనితీరు, స్వచ్ఛత, భద్రత, స్వాగత కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు, పీపీపీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.