అమరావతి (చైతన్యరథం): కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు దుర్మరణం పాలవడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలో సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డం రామరాజు, హాజరత్ వాలీ, తణుకుకు చెందిన వరాడ సుధీర్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్థం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గోనా శివశంకర్, వెంకట సుబ్బారావును చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.