- స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- అక్టోబర్ 2 నాటికి చెత్త లేని పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
- స్వచ్ఛ ఆంధ్ర తోనే నిజమైన స్వర్ణ ఆంధ్ర సాధ్యం
- సీమకు పరిశ్రమలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం
- హరిత ఇంధన కేంద్రంగా సీమను తయారుచేస్తాం
- రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేశాం
- భవిష్యత్తులోనూ ఫ్యాక్షన్ తలెత్తనివ్వం
- కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
- సీ.క్యాంపు రైతుబజార్ సందర్శన.. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాటామంతీ
- పాణ్యం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 50 కోట్లు విడుదల
- రూ. 50 లక్షలతో ఉద్యానవన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
పాణ్యం (చైతన్యరథం): స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణ పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేశామని, భవిష్యత్తులోనూ సీమ గడ్డపై ఫ్యాక్షన్ మాట వినబడనివ్వమని స్పష్టం చేశారు. సీమకు పరిశ్రమలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, హరిత ఇంధన కేంద్రంగా సీమను తయారుచేస్తామని అన్నారు. ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సీ క్యాంప్ రైతుబజార్‌ను పరిశీలించి అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.
స్వచ్ఛాంధ్ర సాధనకు కలిసికట్టుగా పనిచేయాలి
నేను ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాను. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. పల్లెలు, పట్టణాలు, చెరువులు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాలయాల్లో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహించాలి. దుమ్ము దులిపి స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. ఆధునిక ప్రపంచంలో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతిరోజూ అందరూ యోగా చేయాలి. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకూ యోగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
వ్యర్థాల రీ సైక్లింగ్ పై బుద్ధుడి కథను వినిపించిన సీఎం చంద్రబాబు
వ్యర్థాల రీ సైక్లింగ్ పై బుద్ధుడి కథ మనకు కనువిప్పు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా బుద్ధుడు, శిష్యుడు మధ్య జరిగిన సంభాషణను ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఓ రోజు బుద్ధుడి దగ్గరకు వచ్చిన ఓ శిష్యుడు…మీరు ప్రపంచంలోని అందరి గురించి ఆలోచిస్తున్నారు. మీ సొంత శిష్యుల సంక్షేమం మీద కూడా కొంచెం దృష్టిపెడితే బాగుంటుంది కదా అన్నాడు. అందుకు ఏం కావాలో కోరుకోమని బుద్ధుడు చెప్పగా… తన బట్టలు పూర్తిగా చిరిగిపోయాయని, కొత్త బట్టలు కావాలని కోరాడు. బుద్ధుడు ఇచ్చిన కొత్త వస్త్రాలను తీసుకుని శిష్యుడు ఇంటికి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత… బుద్ధుడికి తన శిష్యుడికి ఇచ్చిన వస్త్రం గుర్తొచ్చి తానిచ్చిన కొత్త బట్టలు గురించి అడిగాడు. పాత వస్త్రం ఏం చేశావని బుద్ధుడు అడగ్గా అది నా పడక బొంతలో పరుపుగా వాడుతున్నానని శిష్యుడు చెప్పాడు. ఆ పాత పరుపును ఏం చేశావని అడగ్గా …ఆ పాత బొంతను కిటికీ తెరగా వాడుతున్నా అన్నాడు. మరి పాత తెరను ఏం చేశావనగా….వంటగదిలో వేడి పాత్రలు దించేందుకు మసిగుడ్డగా ఉపయోగిస్తున్నా అని చెప్పాడు. దీంతో వస్తువులను ఎలా వాడుకోవాలో తెలిసిన శిష్యుణ్ణి మనస్ఫూర్తిగా బుద్ధుడు అభినందించాడు. ఈ ప్రపంచంలో దేన్నీ వృథా చేయకండా ప్రతి దాన్ని రీ సైకిల్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చని చెప్పేందుకే ఈ కథను చెప్పానని సీఎం చంద్రబాబు వివరించారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వం పట్టణాల్లోనే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి పోయింది. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేయమని పురపాలక మంత్రి నారాయణకు చెప్పాను. ఇప్పటి వరకూ 55 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించారు. రోడ్డుపై చిన్న కాగితం ముక్క కూడా వేయకుండా బాధ్యతగా వ్యవహరించే దేశం జపాన్ . మనమూ దీన్ని అలవాటు చేసుకోవాలి. చెత్త నుంచి ఎనర్జీ తీసే ప్రాజెక్టులు ప్రస్తుతం రెండు పనిచేస్తున్నాయి. భవిష్యత్‌లో రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలో అందుబాటులోకి వస్తాయి. వీటి వల్ల 90 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి. ఓర్వకల్లు డ్వాక్రా సంఘాలు కోవా బాగా తయారుచేస్తున్నారు. కోటిమందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళలు గ్రామాల్లో ప్రజా చైతన్యం తేవాలి. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కంపోస్ట్ తయారీకి కేంద్రాలు ఏర్పాటు చేశాం. చెత్తను సేకరించి దాన్ని కంపోస్ట్‌గా తయారుచేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నాం. పొడి చెత్తను పరిశ్రమలకు పంపి రీ సైక్లింగ్ చేయిస్తాం. పల్లె పుష్కరిణి అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చెరువులు శుభ్రం చేయబోతున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్స్ వేస్తాము. 123 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్లు పెట్టాం. అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఓడీఎఫ్ ప్లస్‌గా నిలిచాయి.15, 995 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా చేయాలని నిర్ణయించాం. 2026 మార్చి నాటికి వందశాతం ఓడీఎఫ్ ప్లస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మరిన్ని రైతు బజార్లు అందుబాటులోకి తెస్తాం
రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందాలనే లక్ష్యంతో 1998లో నేను రైతు బజార్‌లు ప్రారంభించాను. పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులు ప్రారంభించాం. బస్సు వెనుక సీట్లు ఖాళీ చేయించి అందులో కూరగాయలు వేసి రైతు బజార్లకు రైతులు తరలించేలా ఏర్పాట్లు చేశాం. దీనివల్ల దళారీ బెడద తగ్గించాం. రూ.6 కోట్లు కేటాయించి కర్నూలులోని రైతుబజార్‌ని ఆధునికీకరిస్తాం. ప్రస్తుతమున్న 125 రైతు బజార్ల సంఖ్యను పెంచుతాం. ఒకప్పుడు మొబైల్ రైతు బజార్లు కూడా విజయవంతంగా నడిపించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
రాయలసీమలో కరువు మాట వినబడదు
నేను సీమ బిడ్డను. సీమ అభివృద్ధి నా బాధ్యత. ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు, ఫ్యాక్షన్ అనేవారు. నేను వచ్చాక సీమలో ఫ్యాక్షనిజం మాటే వినబడకుండా చేశాను. కరువు రక్కసి నుంచి సీమ ప్రజలను కాపాడాము. సీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తాం. ప్రస్తుతం సీమలో 18 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ ఉంది. రాబోయే ఐదేళ్లలో 36 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ సాగును పెంచుతాం.16 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ వారు పట్టించుకోలేదు. మైక్రో ఇరిగేషన్ కింద ప్రతి రైతుకు 10 ఎకరాల వరకూ 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. సీమ నాలుగు జిల్లాలకూ నాలుగు ఎయిర్ పోర్టులు (తిరుపతి, కడప, పుట్టపర్తి, ఓర్వకల్లు) ఉన్నాయి. టీడీపీ చొరవతో ఈ జిల్లాలకు జాతీయ రహదారులు అనుసంధానమయ్యాయి. రాబోయే రోజుల్లో సీమ గ్రీన్ ఎనర్జీకి హబ్‌గా తయారవుతుంది. సోలార్ ఇక్కడి నుంచే ఉత్పత్తవుతుంది. విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా పనిచేస్తుంది. ఓర్వకల్లు, కొప్పర్తిలో రూ. 5 వేల కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ వస్తుంది. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమకు గేమ్ ఛేంజర్ అవుతుంది. లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు అనేక పరిశ్రమలు తెస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
ఓవైపు సంక్షేమం -మరోవైపు పెట్టుబడులు
ఎన్డీఏ కూటమిది ప్రజా ప్రభుత్వం. అర్హులకు సంక్షేమం అందిస్తూనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెస్తున్నాము. ఇప్పటికే 76 ప్రాజెక్టులు తెచ్చాం. రూ.4.96 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో 4.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాము. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 4 వేలు మొదలు రూ. 15 వేల వరకూ పింఛను అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాము. దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాము. స్కూళ్లు తెరిచేలోగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టులు భర్తీ చేస్తాం. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు జమ చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. సోలార్ వెలుగులు తెస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇంటిపై కరెంటు తయారీ సౌకర్యం కల్పిస్తాం. అందరం కలిసి పేదలకు అండగా ఉందాం. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా రూపుదిద్దుకుందాం. అవసరమైన సంక్షేమ పథకాలన్నీ అందజేస్తాం. ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. పేదల జీవితాల్లో వెలుగు తేవడానికి పని చేస్తా. నేను పడే కష్టం నా కోసం, ధనవంతుల కోసం కాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే నిర్భాగ్యులు తృప్తిగా ఉండాలని ఆలోచిస్తున్నాను. ఈ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు అభినందించారు.
పాణ్యంలో పలు అభివృద్ధి పనులు
పాణ్యం నియోజకవర్గంలో రూ. 50 లక్షలతో ఉద్యానవన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 50 కోట్లు విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
`