- యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
- సంతకం చేసి మరపురాని జ్ఞాపకంగా లోకేష్‌కు అందజేసిన మోదీ
- దేవాన్ష్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడిన ప్రధాని
- రాష్ట్ర పురోగతికి అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్
- ఏపీకి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని కోరిన యువనేత
న్యూఢల్లీి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢల్లీిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢల్లీిలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో నారా లోకేష్ ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్‌ని ప్రధాన మంత్రి ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది.
2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి, పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. లోకేష్ కుటుంబ యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ను ప్రధాని దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు.
ఇటీవల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలని నారా లోకేష్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.