- రైతులవద్ద మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందే
- క్వింటాల్‌కు రూ.12,500 ధర చెల్లించాలి
- ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం, చర్యలకు వెనకాడం
- ఇకపై రైతులతో బైబ్యాక్ పాలసీ ఒప్పందం చేసుకోవాలి
- అధికారులు, ట్రేడర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- కిలోకు రూ.500 ధర తగ్గకుండా కోకో గింజల కొనుగోలు
- కోకో కొనుగోళ్లకు త్వరలో ఆయిల్‌పామ్ తరహా విధానం
- నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించండి
- సన్నరకాలు పండిరచేలా వరి రైతుల్ని ప్రోత్సహించండి
- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్టం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పొగాకు పండిరచిన రైతులు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోకూడదని… పొగాకు రేటు తగ్గకుండా గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోళ్లను ఆపకూడదని, రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోళ్లను వెంటనే జరపాలని స్పష్టం చేశారు. తాను రైతులు, పరిశ్రమలు- సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలాగని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని.. చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి కొనుగోలుదారులను హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోలు `గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పొగాకు ధర పతనం కావడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూసి… రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు.
20 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యం
హెచ్‌డి బర్లే పొగాకును నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు రూ.12,500కు కంపెనీలు కొనుగోలు చేయాలి. జీపీఐ, ఐటీసీ కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లను ప్రారంభించాలి. కంట్రోల్ రూమ్, వాట్సాప్ గ్రూప్ ద్వారా రోజువారీగా కొనుగోళ్లను పర్యవేక్షించాలి. వ్యవసాయ శాఖ ప్రతి రెండు రోజులకు ఒకసారి కొనుగోలు వివరాలను నివేదించాలి. వచ్చే సాగు సీజన్‌లో అంతర్జాతీయ డిమాండ్, ధరల ఆధారంగా హెచ్‌డి బర్లే సాగు విస్తీర్ణాన్ని నియంత్రించేలా, ఈరకం సాగువైపు మళ్లకుండా రైతుల్లో అవగాహన పెంచేందుకు 2025 జూన్‌నుంచి సమావేశాలు నిర్వహించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.
పొగాకు నిల్వలు ఎక్కడా మిగలకూడదు
రైతుల ఇళ్లల్లోనూ, పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు మిగిలిపోకూడదని…. తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేసి అవసరమైతే గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు ఏస్థాయిలో జరుపుతున్నారు, ఎంతమేర ధర చెల్లిస్తున్నారు… అనే నివేదిక సోమవారంనాటికి ఇవ్వాలని ఆదేశించారు. రైతుల్లో అసంతృప్తి రావడానికి వీల్లేదని, వారు నష్టపోకూడదని స్పష్టం చేశారు.
అనూహ్యంగా పెరిగిన పొగాకు దిగుబడి
ఎఫ్‌సీవీ, వైట్ బర్లీ, హెచ్డీ బర్లీ.. ఈ 3 రకాల పొగాకు కలిపి 2024-25 కాలంలో రాష్ట్రంలో 1,90,456 హెక్టార్లలో సాగు చేశారని… 450 మిలియన్ కేజీల దిగుబడి వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది అత్యధిక పంట దిగుబడి అని, మిగిలిన పంటల నుంచి పొగాకు సాగువైపు రైతులు మొగ్గు చూపించడంతో… అనూహ్యంగా ఉత్పత్తి రెట్టింపై సమస్య ఉత్పన్నమైందన్నారు.
అధిక ధరలు చూపి మాయాజాలం
పొగాకు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైందని… జీపీఐ, ఐటీసీవంటి ట్రేడర్లతో సరైన సమన్వయం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అత్యధిక ధరలు ఆశ చూపించి రైతులు పొగాకు సాగు చేసేలా చేస్తున్న కంపెనీలు, తీరా పంట చేతికి వచ్చేసరికి అమాంతం ధరలు తగ్గించడం సరికాదన్నారు. కనీస మద్దతు ధర కల్పించకుండా సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని కంపెనీల తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు.
బై బ్యాక్ పాలసీ ఉంటేనే పొగాకు సాగు
ప్రస్తుతం నెలకొన్న సమస్యను అధిగమించాలంటే బైబ్యాక్ పాలసీ ఉత్తమమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇకపై కంపెనీలతో రైతులు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని సూచించారు. బైబ్యాక్ విధానం అమలు, కొనుగోళ్లు జరిగేలా పొగాకు బోర్డు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్లోబల్ డిమాండ్, సప్లయ్‌కు అనుగుణంగా ధర నిర్ణయించి రైతులకు లాభాలు వచ్చేలా చేయాలన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతులు పూర్తిగా పొగాకు పండిరచడం మానేస్తారని, అప్పుడు కంపెనీలన్నీ మూతపడే పరిస్థితి తలెత్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అలాగే క్రాప్ రీషెడ్యూల్ చేయాలని, దీనికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. పొగాకు నుంచి ఇతర వాణిజ్య పంటల సాగువైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. పంట మార్పిడి ద్వారానే రైతులు నష్టపోకుండా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు.
కొనుగోళ్ల ఆలస్యంపై కంపెనీల వివరణ
పొగాకు బోర్డు కేవలం ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతులను నియంత్రిస్తుంది. వైట్ బర్లే (వినుకొండ బర్లే)ను 90 శాతం కంపెనీలు కొనుగోలు చేశాయి. మిగిలిన హెచ్‌డి బర్లే రకాన్ని రైతులు కంపెనీలతో ఏవిధమైన ఒప్పందం లేకుండా సాగు చేస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, పత్తిలో తెగుళ్లు ఎక్కవ అవ్వడం, హెచ్‌డి బర్లే పొగాకు మొక్కలు స్థానిక నర్సరీల్లో అందుబాటులో ఉండటంతో రైతులు ఈ రకం సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా ఈ రకాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు. దిగువ ఆకులు 15 మిలియన్ కిలోలు ఇప్పటికే కంపెనీలు, స్థానిక వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన పంటను కొనేందుకు ఎగుమతి ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని, అలాగే గోదాముల కొరత, నిధుల సమస్య ఉందని, కూలీల సమస్య వల్ల గ్రేడిరగ్, ప్రాసెసింగ్ ఆలస్యంగా సాగుతోందని కంపెనీలు చెబుతున్నాయి.
కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలి
కోకో పంట గిట్టుబాటు ధరపైనా సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… కోకో గింజలను కిలోకు రూ.500 ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని మాండలీజ్ సంస్థకు సూచించారు. కోకో గింజల కొనుగోలులో రైతులను ఏ కంపెనీ దోపిడి చేయడాన్ని సహించేది లేదన్నారు. ఇతర కంపెనీలతోనూ సంప్రదింపులు జరిపి కిలో రూ.500 ధరకు కొనుగోలు చేసేలా సమన్వయం చేయాలని సూచించారు. కోకో సాగు నుంచి…. పంట విలువ పెంపు వరకు ప్రణాళికను మాండలీజ్ సంస్థ రూపొందించాలని చెప్పారు. ఆయిల్ పామ్ తరహాలో ఒక ప్రత్యేక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని సీపం చంద్రబాబు అన్నారు.
కొనుగోలు సంస్థలు సహకరించాలి
రైతులు, పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని, ఆ విధంగానే కంపెనీలు ప్రభుత్వానికి సహకరించి రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో కోకో రైతుల దగ్గర చివరి గింజ వరకు కొనుగోలు జరపాలన్నారు. ఫార్వర్డ్- బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోకో గింజల నాణ్యతను మెరుగుపరచడానికి కొనుగోలు సంస్థలు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
నాణ్యత సాకుతో ధర తగ్గిస్తున్న సంస్థలు
రాష్ట్రంలో ఈ ఏడాది 12,000 మెట్రిక్ టన్నుల కోకో దిగుబడులు రాగా, ఇప్పటికే అధిక మొత్తంలో కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతేడాది అత్యధిక ధర చెల్లించి.. ఈ ఏడాది ఒక్కసారిగా ధర తగ్గించడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ఏపీలో కోకో పంట నాణ్యత తక్కువ ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదని చెప్పి కొనుగోలు సంస్థలు ధరలు తగ్గించాయని అన్నారు. అయితే ప్రస్తుతం కోకో రైతుల దగ్గర మిగిలిపోయిన 2,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని పూర్తిగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
నష్టపోయిన మిర్చి రైతులతో జాబితా
వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మిరప పంటను విక్రయించిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతులు ఎంతమేర నష్టపోయారనే దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ జాబితాలో దళారులను పూర్తిగా తొలగించి, నిజమైన రైతులను మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. మిర్చి రైతుల్లో పురుగుమందుల వినియోగం తగ్గించేలా, ఎగుమతులు తగ్గట్టు నాణ్యతాప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.
పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ
రాష్ట్రంలో ఇంకా రైతుల దగ్గర మిగిలివున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే సన్న రకాలు పండిరచేలా రైతుల్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు ఈ రబీలో 1,41,144 మంది రైతుల నుంచి 17.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వీరికి రూ.3,258 కోట్లు జమ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 రబీ కాలానికి కేవలం 10.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 49,866 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,103 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే, ఈ ఖరీఫ్‌లో 5,65,369 మంది రైతుల నుంచి 35.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వీరికి రూ. 8,278 కోట్లు జమ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 ఖరీఫ్ కాలానికి కేవలం 29.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4,97,907 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.6,549 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.