గత జన్మ పాపాలు ఎదోక రూపంలో ఈ జన్మను పీడిస్తాయంటారు పెద్దలు. అందులో అంతరార్థం ఏమైనా, పూర్వం పదవిలో ఉన్నప్పుడు చేసిన పాతకాలు తాము అధికారం కోల్పోయిన తరవాత నిద్రపట్టకుండా చేస్తాయన్నది తాజా రాజకీయ వాస్తవం. నిజం నిలకడమీద బయట పడుతుందంటారు. యావత్ దేశం బిత్తరపోయేలా జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్తుంటే విచారణ అధికారులకే కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. 2019లో మధ్య నిషేధమంటూ రాష్ట్ర ప్రజల కళ్ళకు గంతలుకట్టి దోపిడీకి మద్యాన్ని మార్గంగా ఎన్నుకొని చేసిన సాగించిన దందా యావత్తు జాతిముందు పుటలు పుటలుగా ఆవిష్కృతమవుతుంది. జగన్ ప్రభుత్వహయంలో జరిగిన మద్యం విక్రయాల్లో మాయమైన మొత్తంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిఐడి విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించించింది. కూటమి నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలూ ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ఇచ్చిన నివేదికలోనూ భారీ కుంభకోణం జరిగినట్టు చెబుతున్నారు. దశలవారీగా మద్య నిషేధమంటూ ఇచ్చిన హామీని జగన్ ప్రభుత్వం ఏదశలోనూ అమలు చేయలేదు. అధికారుల నివేదిక ప్రకారం 2019-24 మధ్య రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. కానీ ఆస్థాయిలో నిధులు రాష్ట్ర ఖజానాకు చేరలేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో రూ.99 వేల కోట్ల మద్యం తయారీ, అమ్మకాలు జరగ్గా కేవలం రూ.18,860 కోట్ల ఆదాయం మాత్రమే చూపారని శాసనసభలో సీఎం చంద్రబాబు చెప్పారు.
అంతకన్నా ఎక్కువే ఉంటుందని దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ సభ్యులు. ఈ మొత్తం దోపిడి పూర్వాపరాలను నిగ్గుతేల్చడానికి సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నది కూటమి ప్రభుత్వం. జగన్ ముఠా మద్యం దందాలను వెలికితీయడంతోపాటు నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తయ్యేలా చూడటం అత్యావశ్యకం. అతిపెద్ద మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులయిన చిన్న చేపలను కటకటాల్లోకి పంపడం కాదు అంతిమంగా లబ్దిపొందిన అతిపెద్ద తిమింగలాన్ని అరెస్టు చెయ్యడం, తిమింగలం మింగిన ప్రతి పైసాను కక్కించడమూ ప్రభుత్వ బాధ్యతే. అలా రాబట్టిన సొమ్మును జే బ్రాండ్లతో ఛిద్రమైన జనారోగ్యాన్ని బాగుచేసేందుకు వినియోగించాలి. నకిలీ మద్యం ముఠా స్వాహాపర్వాలను బట్టబయలు చేసి, వారికి తగిన శిక్షలు పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అధికారాన్ని అవినీతి గనిగా మార్చి నకిలీ మద్యం ద్వారా అక్రమార్గంలో జగన్ ముఠా దురాశకు అవినీతికి యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. నకిలీ మద్యం మహమ్మారిని రాష్ట్రంమీదకు వదిలి ప్రజల సొమ్మును ఆయురారోగ్యాలను గుల్ల చేశారు. జగన్ ఏలుబడిలో ఎగబాకిన నకిలీ మద్యం అమ్మకాలు మూలంగా చుట్టుముట్టిన నానా రోగాలు, పడిపోయిన కుటుంబ ఆదాయాలు, గడచిన ఐదేళ్లలో లక్షల కోట్లమేరకు ప్రజానీకానికి నష్టం వాటిల్లినట్లు, విషతుల్యమైన మద్యం కారణంగా ఎన్నో తాళిబొట్లు తెగిపోయినట్లు, మద్యం సరఫరా సంస్థలనుంచి రూ.3,113 కోట్ల వరకు కమీషనన్లు దండుకున్నట్టు సమాచారం.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐదేళ్లలోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోవడం ఎట్లాగో జగన్‌కి తెలిసినంతగా దేశంలో మరొకరికి తెలియదు. తండ్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్ల సంపద పోగేసుకున్న జగన్మోహన్‌రెడ్డి, తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఇంకెన్ని వేల కోట్లు పోగేసుకొని ఉంటారో ఏ ఆర్ధిక నిపుణుడు లెక్క తేల్చగలడు? ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో సిట్ అరెస్టు చేసింది.
లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. చాణక్య, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విచారణ తర్వాత ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. ముడుపులు ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించడంలో బాలాజీ తెరవెనుక వ్యవహారం నడిపినట్టు సిట్ అధికారులు గుర్తించారు. గతంలో విజయసాయిరెడ్డి తరహాలోనే ఈయన కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా తన తెలివి తేటలు ఉపయోగించి తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు మూటలు తరలించినట్లు ఆధారాలను సిట్ గుర్తించింది. ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా 9న ఇచ్చిన నోటీసును తిరస్కరించి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. జగన్ ప్రభుత్వంలో తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.3,200 కోట్ల మద్యం ముడుపులు చేరినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వున్నాయి. తాడేపల్లిప్యాలెస్‌కు మద్యం డబ్బులు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఈయన 2009లో అప్పటి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వద్ద చేరారు. ఆయన ద్వారానే జగన్ కుటుంబానికి దగ్గరై, తర్వాత విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో బాలాజీ పూర్తిస్థాయిలో భారతీ సిమెంట్స్‌తో పాటు జగన్, భారతి ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ, వారికి అత్యంత సన్నిహితునిగా మారారు. అనతి కాలంలోనే భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఎదిగారు.
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకూ ప్రతి దోపిడీలో బాలాజీ పాత్ర ఉన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడయింది. రాజ్ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరూ పేరూ లేని షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ తేల్చింది. మొత్తం మద్యం బాగోతాన్ని పసిగట్టిన అధికారులు ఆయనను విచారించి అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చబోతున్నారు. రూ.వేల కోట్ల రూపాయలు ఎవరికి చేరాయి? ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడకు చేర్చారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సృష్టించిన షెల్ కంపెనీలు ఎవరివి? వాటిలో ఎవరి పేరుతో పెట్టుబడులు పెట్టారు? నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్, హవాలా మార్గంలో వెళ్లిన డబ్బుల వివరాలు లెక్క తేల్చాలి. గతంలో ఎన్నడూ జరగని విధంగా జరిగిన ఈ కుంభకోణంలో పిల్ల చేపలకే పరిమితం చెయ్యకుండా అంతిమంగా లబ్ది పొందిన తిమింగలాన్ని అరెస్టు చెయ్యాలి.
జగన్మోహాన్‌రెడ్డి ధనదాహం అంతులేనిది. నేరాలు చెయ్యడంలో సిద్దహస్తులు అయిన ఇద్దరు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లను ఆయుధాలుగా ఉపయోగించి లక్షల కోట్లు ప్రజాధనం కైంకర్యం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా డొల్ల కంపెనీల ద్వారా జగన్ దోపిడీకి బాటలు వేశారు. తండ్రి వైఎస్ పదివీ హయాంలో తనయుడు జగన్‌కి లబ్ధి కలిగించేందుకు సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటు చేయించి.. రూ.43వేల కోట్ల కుంభకోణంలో సీబీఐ విజయసాయిరెడ్డి పాత్ర ప్రధానమైనదిగా సీబీఐ గుర్తించింది. జగన్‌పై సీబీఐ నమోదు చేసిన, ఈడీ చార్జిషీట్లు అన్నింటిలోనూ సాయిరెడ్డిని కూడా ఏ2గా చేర్చింది. విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి అప్పట్లో చంచల్‌గూడ జైలుకు కూడా పంపించింది. ఇప్పుడు జగన్ సీఎంగా ఉండగా జరిగిన మద్యం ముడుపులను ఊరూ పేరూ లేని షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో సీఏ బాలాజీ గోవిందప్ప ప్రధాన పాత్ర పోషించి సిట్‌కు చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఏదేమైనా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. బెంగళూరులోనే రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్లు కీలక సమాచారం.
ముడుపుల డబ్బును డొల్ల కంపెనీల ద్వారా పలు స్థిరాస్తి సంస్థల్లోకి మళ్లించటంలో సిద్దహస్తుడు అయిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు జగన్, భారతిలకు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తీ క్రియాశీలక పాత్ర పోషించినట్లు సిట్ చెబుతున్నది. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏయే మార్గాల ద్వారా మళ్లించి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలనే దానిపై బెంగళూరు ప్యాలెస్‌లోనే వారానికోసారి నిర్వహించే సమావేశాల్లో వీరిద్దరూ పాల్గొనే వారని కూడా సమాచారం సేకరించింది. గోవిందప్ప అరెస్టు కావటంతో అతనితోపాటు ఆ రెండో వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే మద్యం కుంభకోణం అసలు భాగోతం, అంతిమ లబ్దిదారుడు ఎవరూ అనే గుట్టు వీడనున్నది. ప్రస్తుతం సిట్ అధికారులు ముడుపులు అందుకొన్న అసలు తిమింగలం ఎవరో నిగ్గు తేల్చాలి. అంతేకాదు మద్యం కుంభకోణంలో పిల్ల చేపలను అరెస్టు చెయ్యడంకాదు అంతిమంగా భారీ లబ్ది పొందిన తిమింగలాన్ని అరెస్టు చెయ్యడం, మేసిన ప్రతి పైసాను కక్కించడమూ ప్రభుత్వ బాధ్యతే. అవినీతికి పాల్పడటమే కాదు నాణ్యతలేని మద్యంవల్ల బలి అయ్యింది బడుగు, బలహీనవర్గాలే. నిరుపేదలే వేలమంది ప్రాణాలు గాలిలో కలిసి పొయ్యాయి. ఇంతటి హేయమైన కుంభకోణం దేశం ఎక్కడా జరగలేదు!
నీరుకొండ ప్రసాద్