అమరావతి (చైతన్యరథం): అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత బేతపల్లికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. బేతపల్లి నుంచి గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లెకు బయలుదేరిన మంత్రి లోకేష్‌కు అడుగడుగునా పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజానీకం జేజేలు పలికారు. మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం రామరాజుపల్లెలో టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో, అనంతరం గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయం సమావేశంలో పాల్గొంటారు. శుక్రవారం బేతపల్లిలో రెన్యు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అనంతపురంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు కుమార్తె వివాహానికి హాజరవుతారు. 17వ తేదీన అనంతపురం జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి మంత్రి నారా లోకేష్ హాజరవుతారు.