- ఐదేళ్లు నరకం అనుభవించాం.. పడిన అవమానాలు మర్చిపోకూడదు
- చర్చించుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం
- పరిశ్రమల ఏర్పాటుద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- డీఎస్సీ ఆపేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన వైసీపీ
- గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్
గుంతకల్లు (చైతన్యరథం): అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో గురువారం మంత్రి లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చానని, మాట నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చానన్నారు. 2019 ఎన్నికల్లో మనం ఓటమి పాలయ్యాం. ఆనాడు అసెంబ్లీలో అమరావతి అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచారు. అందుకే పార్టీ వారి రుణం తీర్చుకుందని మంత్రి లోకేష్ తెలిపారు.
మనం పడిన అవమానాలు మర్చిపోకూడదు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94 శాతం సీట్లతో విజయం సాధించాం. గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. 2019-24 మధ్య మనం పడిన అవమానాలు మర్చిపోకూడదు. ఏ తప్పూ చేయని చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారు. ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, పల్నాడులో తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి. కార్యకర్తలు, నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారు. యువగళంలో నన్ను అనేక విధాలుగా అవమానించారు. మన రక్తంలోనే పసుపు ఉంది. అడుగడుగునా పోరాడి విజయం సాధించాం. ఈ జిల్లాలో యువగగళాన్ని ప్రభంజనంలా మార్చారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం పట్టింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు అందిస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. కోటి మందికి దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. ఇప్పుడు నాలుగు నెలలకు ఒకసారి రూ.800 నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో జమచేస్తాం. జూన్ మాసంలో తల్లికి వందనం కార్యక్రమం అమలుచేస్తాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
డీఎస్సీ ఆపేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు
మెగా డీఎస్సీ ద్వారా 16,247 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. జూన్ మాసం నుంచి పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సమయం పెంచాలంటున్నారు. గతేడాది డిసెంబర్ లోనే సిలబస్‌ను ప్రకటించాం. జగన్ రెడ్డికి అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదు. స్థానికులకే పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రూ.22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందాం
టీడీపీకి కార్యకర్తలే బలం. అధికారంలోకి వచ్చామని అహంకారం వద్దు. ఓర్పు, సహనంతో ప్రజలకు సమాధానం చెబుదాం. కార్యకర్తలు.. ప్రజల చుట్టూ తిరిగితే మేం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. నేతలు అలకలు వీడాలి. పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా. చర్చించుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. ఐదేళ్లు నరకం అనుభవించాం. అది మర్చిపోకూడదు. అడుగడుగునా అవమానించారు. అక్రమ కేసులు పెట్టారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. మహానాడు నాటికి కమిటీలను పూర్తిచేయాలి. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పుట్టిపెరిగింది టీడీపీలోనేనని, ఓర్పు, సహనంతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. 2014-19 మధ్య పెండిరగ్ బిల్లులను చెల్లిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
టైం మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబుతో పోటీపడుతున్నారు: మంత్రి పయ్యావుల
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉండిరదన్నారు. కేంద్రం, సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో ప్రభుత్వాన్ని నడుపుకోగలగుతున్నాం. సీఎం చంద్రబాబును చూసి పరిశ్రమలు వస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా రూ.3,800 కోట్లతో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తిచేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అనంతలో రూ.22 వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ రాబోతోంది. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. టైం మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్రబాబుతో పోటీపడుతున్నారు. పనితీరు చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. నాయకుల కంటే కార్యకర్తలకే ఎక్కువ సమయం ఇస్తున్నారు. మరో 30 ఏళ్ల పాటు బలమైన నాయకత్వాన్ని తయారుచేసే పనిలో ఉన్నారని, ఇందుకు లోకేష్‌కి మద్దతుగా నిలబడదామని మంత్రి పయ్యావుల పిలుపు ఇచ్చారు.
పౌరుషాగ్ని రగిలించిన లోకేష్: ఎమ్మెల్యే జయరాం
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. యువగళం ద్వారా నారా లోకేష్ యువతలో పౌరుషాగ్ని రగిలించారన్నారు. దేశంలో కోటిమంది సభ్యత్వం ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా మంది నన్ను అదృష్టవంతుడని అంటున్నారు. నాకు అదృష్టం కల్పించిన నాయకుడు చంద్రబాబునాయుడు. రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి టీడీపీ జెండాను రెపరెపలాడిద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జోనల్ కో ఆర్డినేటర్ కోవెలమూడి రవీంద్ర, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడు తిమ్మయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.