అమరావతి (చైతన్యరథం): పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలవడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వినుకొండ మండలం శివాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలను తరలిస్తున్న బొప్పాయి కాయల లోడు ఉన్న మినీ ట్రాలీని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొదట ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామస్తులు, స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం జరిగింది. మృతులు ప్రకాశం జిల్లాలోని ఎర్రకొండపాలెం మండలం గడ్డమీద పల్లికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.