- పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం
- అనుమతుల విషయంలో సమస్యలు లేకుండా చూడాలి
- రాష్ట్రాభివృద్ధిలో అధికారులు కూడా భాగమవ్వాలి
- ఏపీఐఐసీ జీఎంల సమావేశంలో మంత్రి టీజీ భరత్
అమరావతి (చైతన్యరథం): ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో అన్ని జిల్లాల జీఎంలతో నిర్వహించిన సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్‌తో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్న పెండిరగ్ ప్రాజెక్టులు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు సంబంధించిన అనుమతుల వివరాలు ఆరా తీశారు. గత 5 ఎస్‌ఐపిబి సమావేశాల్లో ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. ఆర్సెలార్ మిట్టల్, బిపిసిఎల్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, టఫే, టాటా కన్సల్టెన్సీతో పాటు అన్ని కంపెనీల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్‌ఎంఈ పాలసీలను వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీల గురించి జిల్లాల వారీగా, పరిశ్రమల వారీగా చర్చించారు.
అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఏ జిల్లాలో పరిశ్రమలు పెడుతున్నారో అక్కడి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అధికారులు భాగమవ్వాలని మంత్రి సూచించారు. పెద్ద పెద్ద కంపెనీలతో పాటు ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యండ్లూమ్ టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటవుతున్నాయన్నారు. వీటి ద్వారా స్థానికంగా పెట్టుబడులు రావడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. పరిశ్రమల ఏర్పాటులో జిల్లా స్థాయిలో జీఎంల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని మంత్రి భరత్ ఆదేశించారు.