- జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు, దాష్టీకాలు
- పీ 4తో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి
- హోం మంత్రి అనిత ఉద్ఘాటన
- తణుకు నియోజకర్గంలో బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ
- వెనుకబడిన తరగతుల సహకార ఆర్థికసంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
తణుకు (చైతన్యరథం): ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించి నేటికి ఏడాది పూర్తయిందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దాదాపు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మంగళవారం హోం మంత్రి అనిత సుమారు రూ.6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభిచడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని తణుకు, అత్తిలిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపనలతో పాటు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఈర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. దళితులకు అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ రెండు కళ్ల లాంటి వారన్నారు.
అలాంటి వ్యక్తుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేసుకోవడం దళితుల ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. 2019లో జగన్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దళితులను టార్గెట్ చేసి పాలన సాగించారని మండిపడ్డారు. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్రవేసి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ నాయకులదేనని మండిపడ్డారు. ఓ మహిళా అధికారిని ఎన్నో రకాలుగా వేధించారన్నారు. తణుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో మునిగిపోయారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దళితుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. బంగారు కుటుంబం కాన్సెప్ట్‌తో పీ4 విధానం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సమానత్వానికి మార్గదర్శిగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు హోంమంత్రి అనిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రామకృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు.