- అద్భుతమైన ఆటతో క్రికెట్ ప్రమాణాలు పెంచాడు
- టెస్ట్‌లకు వీడ్కోలుపై మంత్రి లోకేష్ స్పందన
అమరావతి (చైతన్యరథం): క్రికెట్‌లో అత్యుత్తమమైన టెస్ట్ క్రికెట్ నుండి ఒక లెజెండ్ నిష్క్రమణతో మనసు భారంగా ఉందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకటంపై ఎక్స్‌లో మంత్రి లోకేష్ స్పందించారు. ఆట పట్ల విరాట్ చూపించే ప్రేమ, అంకితభావం, నిబద్ధత భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రను పునర్‌నిర్వచించాయని కొనియాడారు. కోహ్లి అద్భుతమైన ప్రతిభతో క్రికెట్ ఆట ప్రమాణాలను ఎంతో ఎత్తుకు పెంచటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచాడన్నారు. మోయలేని అంచనాల బరువుతో మైదానంలో దిగిన ప్రతిసారీ తనదైన శైలిలో చూడచక్కని షాట్లతో స్థిరంగా రాణించి మెప్పించిన అతి తక్కువమంది క్రికెటర్లో ఒకడిగా కోహ్లి మెరిశాడని మంత్రి లోకేష్ ప్రశంసించారు.