- తప్పు చేసిన వారిపైనే చట్ట ప్రకారం చర్యలు
- వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం
- సాక్షాత్తూ శాసనసభలోనే నాపై దాడి చేశారు
- వైసీపీ చేసిన పాపాలు, మోసాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు
- మీడియాతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
ఒంగోలు (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని, వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సోమవారం నాడు ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో నూతనంగా నిర్మించిన హర్షిణి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాలో నూతనంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, ఈ కళాశాల ఏర్పాటుతో సమీప గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు తక్కువ ఫీజులతో ఇంజనీరింగ్ చదివే అవకాశం లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, లోకేష్ మంత్రిగా విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి డోలా అన్నారు.
అనంతరం మీడియాతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం లేదని, కూటమి కూటమి ప్రభుత్వం ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని తెలిపారు. తప్పు చేసిన వారిపైనే చట్టపరంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలను కనీసం బయటకు కూడా రానివ్వలేదన్నారు. సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలోనే వైసీపీ ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని మంత్రి డోలా అన్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు చేసిన పాపాలు, మోసాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పారని మంత్రి డోలా అన్నారు.