పెనుకొండ (చైతన్యరథం): ఆపరేషన్ సిందూర్‌లో సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన వీర జవాన్, అగ్నివీర్ మురళీ నాయక్ పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. పాక్ మూకల కాల్పుల్లో శుక్రవారం ఉదయం నేలకొరిగిన మురళీ నాయక్ పార్థివ దేహం శనివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. మిలిటరీ కాన్వాయ్ దాదాపు 300 వాహనాలతో కలసి బయలుదేరి పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలంలో మురళీ నాయక్ స్వగ్రామం కల్లితాండ గ్రామానికి చేరుకుంది. గుమ్మయ్యగారిపల్లి నుండి క్రాస్ నుండి కల్లితాండ వరకు మంత్రి సవితమ్మతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజలతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, మురళీ నాయక్ అమర్ రహే అని నినాదాలు చేశారు.