అమరావతి (చైతన్యరథం): భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశ సాయుధ దళాలు ఉగ్రవాద నిర్మూలనలో చూపిస్తున్న ధైర్యం ప్రతీ భారతీయునికి గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లకు తన వంతు సంఫీుభావంగా, సైనికులకు బాసటగా తన నెల జీతం రూ.2,17,000/ జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న కృషి దేశ ప్రజలందరిలో జాతీయభావనను పెంపొందించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.