- అధికారం, స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాకూడదు
- పేదల ఉన్నతి, రాష్ట్ర ప్రగతి లక్ష్యం కావాలి
- ఎన్టీఆర్, చంద్రబాబు అడుగుజాడల్లో నడుద్దాం
- టీడీపీ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
అమరావతి (చైతన్యరథం): అధికారం కోసమో, ఆర్థిక లాభాల కోసమో ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదు.. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడై ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమం మూడోరోజు శుక్రవారం విజయంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నాయకులు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి నేతలను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మాట్లాడుతూ ప్రజల సేవే పరమాత్మ సేవగా భావించి రాజకీయాల్లో రాణించే వ్యక్తులే ప్రజల హృదయాలను గెలుచుకొని శాశ్వతంగా రాజకీయాల్లో మనగలుగుతారన్నారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే నినాదంతో పుట్టిన పార్టి టీడీపీ అని గుర్తుచేశారు. ప్రజలు కూడు, గుడ్డ, నీడ కోసం అల్లాడకూదని.. నాడు అన్న ఎన్టీఆర్ మహోన్నతమైన ఆశయంతో ముందుకు సాగి.. పేదల ఉన్నతికి, వారి ప్రగతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. కర్షకులు, కార్మికులకు, అక్కచెల్లెమ్మలకు పెద్ద పీట వేస్తూ.. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఆస్తిలో సగభాగంతో పాటు.. 33శాతం రిజర్వేషన్ కల్పించి సమాజంలో స్త్రీలకు సరైన గుర్తింపును ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని పల్లా వివరించారు.
ప్రగతి కోసమే చంద్రబాబు తపన
ఆ తరువాత మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు.. అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, నవనిర్మాణ సమాజానికి పెద్దపీట వేస్తూ, నాడే విజన్ 2020 తో ఐటీ విప్లవాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకు వచ్చి హైదరాబాద్‌ను ఐటీకి మేటిగా నిలిపారు. నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 30 లక్షలకు పైగా రైతులు బిడ్డలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు ముందు చూపు వల్లే. నేడు ప్రంపంచాన్ని ఐటీ శాసిస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐ ఏలుతుంది. ముందు చూపు లేని నాయకులు, మంచి సమాజాన్ని నిర్మిద్దామన్న ఆలోచనలు లేని నాయకులు వారి స్వాలాభాల కోసం ఆలోచిస్తే.. చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతినిత్యం ప్రజా సంక్షేమానికి, ప్రగతి కోసం పరితపిస్తారు. దీనికి ఉదాహరణే విజన్ ` 2047 స్వర్ణాంధ్ర అని పల్లా స్పష్టం చేశారు.
అబద్ధాలను నమ్ముకుంటే అధోగతే
ఉగ్రమూకల కంటే భయంకరమైన ఫేక్ నాయకులు నాడు బాబాయిని గొడ్డలి వేటుకు బలిచేసి.. అబద్ధాలను ప్రచారం చేసి అధికారం చేపట్టారు. దోపిడీయే ఏకైక ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. దోచుకో, దాచుకో, తినుకో సుత్రాలతో దుష్ట చతుష్టయాలు రాష్ట్రంపై పడి.. ప్రకృతి వనరులతో పాటు ప్రజలను కూడా ఇష్టానుసారంగా దోచుకున్నారు. ప్రశ్నించిన ప్రజల పీకలు కోశారు. అందుకే వారికి గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రజలు కర్రుతో కాల్చి వాతపెట్టినా ఫేక్ నేతల బుద్ది మారడంలేదు. అబద్ధాలను ప్రచారం చేయడం ఆపడం లేదు. అబద్ధాలను నమ్ముకున్న నాయకులు ఎప్పటికైనా అధ:పాతాళంలోకి పడిపోవాల్సిందే. ఇప్పటికే ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరు కటకటాల్లోకి ప్రయాణం కడుతున్నారు. రాష్ట్రాన్ని నిలువుగా దోచున్న నేతలను ఉరితీసినా పాపంలేదు. చైనా లాంటి దేశంలో ఆర్థిక నేరగాళ్లకు ఉరిశిక్షలు వేస్తున్నారు. మన దేశంలో కూడా అటువంటి శిక్షలు అమలు చేస్తేనే దోపిడీ దారుల పీడ వదులుతుందని పల్లా అన్నారు.
భావితరాల భవిష్యత్ కోసం..
నాయకుడు అనేవాడు ఫలాలతో నిండా మగ్గిన చెట్టులాంటి వాడు.. తన స్వార్థం కోసం ఆలోచించకుండా.. ఎదుటి వారి ఆకలి గురించి ఆలోచించి వారికి ఫలాలను అందించడమే తన కర్తవ్యంగా ముందుకు నడవాలి. అందులో ఉండే ఆనందమే తనకు ప్రజలు ఇచ్చే బలమై తనను మరింత ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అలాంటిది.. చెట్టే ఫలాలపై ఆశపడితే, ప్రయోజనం లేని చెట్టుగా భావించి ప్రజలే దానిని కూకటి వేళ్లతో పెకిలిస్తారు. ప్రజలు ఇచ్చే ఫలితం చాలా గొప్పది. ప్రతి నాయకుడు ఓర్పు, సహనంతో ముందుకు నడిస్తే సరైన సమయంలో సరైన ఫలితాన్ని, రాజకీయ గుర్తింపును పొందుతారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి. భావితరాల భవిష్యత్ కోసం, ప్రగతిశీల సమాజం కోసం, నవ సమాజం కోసం టీడీపీ శ్రేణులు కంకణబద్ధులై పనిచేయాలి. దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎండగడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను తిప్పి కొడుతూ.. ఉద్వేగభరితమైన పోస్టులతో కాకుండా.. నైతికంగానే దుష్ట నేతలకు బుద్ధివచ్చేలా సమాధానాలు చెబుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజా రంజక పాలనకు ప్రతిఒక్కరం కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలకు ఆదర్శంగా నిలుద్దామని పల్లా పిలుపు ఇచ్చారు.