- ప్రణాళికాబద్ధంగా అల్లూరి జిల్లాలో క్రీడల అభివృద్ది
- గిరిజన యువత క్రీడల్లో రాణించడమే ధ్యేయం
- క్రీడాసదుపాయాల కల్పనకు శాప్ చర్యలు
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టీకరణ
- అరకు, డుంబ్రిగుడలో ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్, స్థలాలు పరిశీలన
- క్రీడల అభివృద్ధికి తొలిసారి మన్యంలో పర్యటించిన శాప్ ఛైర్మన్‌కు గిరిజన యువత కృతజ్ఞతలు
అరకు (చైతన్యరథం): గిరిజన యువత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రణాళికాబద్ధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని యువతీయువకులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగుడ మండలం అంజోడా గ్రామంలో ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కేటాయించిన 26.34 ఎకరాల స్థలంతోపాటు అరకులోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌ను అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి సీవేరి దన్నుదొర, అల్లూరి జిల్లా డీఎస్డీఓ ఏ.జగన్‌మోహన్‌రావు, అరకు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ పీఎస్‌ఎన్.మూర్తితో కలిసి శుక్రవారం రవినాయుడు పరిశీలించారు. ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌కు కేటాయించిన స్థలం స్థితిగతులు, పూర్వాపరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారుచేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబునాయుడు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌కు కేటాయించిన స్థలాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేందన్నారు.
దాని కారణంగా ఐదేళ్లుగా క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన భూమి నిరుపయోగంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్రీడలకు పూర్వవైభవం చేకూరుతుందని, శాప్ ఛైర్మన్‌గా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం తక్షణమే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించడంతోపాటు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఆర్థిక వనరులపై అధ్యయనం చేయాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అల్లూరి జిల్లాలోని యువత ఏ క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నారో.. ఆ క్రీడలకు సంబంధించి అత్యుత్తమ క్రీడావసతులను కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు దాతల సహకారం అవసరమని, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, క్రీడా ఔత్సాహికులు ట్రైబల్ ఏరియాలో క్రీడసదుపాయాలను కల్పించేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే క్రీడల అభివృద్ధికి సైతం పీ-4 విధానాన్ని అమలు చేయాలని సూచించారన్నారు. పీ-4 విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అత్యుత్తమ క్రీడాసదుపాయాలు కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన తొలి శాప్ ఛైర్మన్..
గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లాలో క్రీడలను, క్రీడాకారులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అరకు నియోజకవర్గానికి విచ్చేసిన శాప్ ఛైర్మన్‌కు పలువురు క్రీడాకారులు, తెలుగుయువత, టీడీపీ నాయకులు, గిరిజన నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. గిరిజన యువకులు క్రీడల్లో రాణిస్తున్నప్పటికీ సరైన క్రీడాసదుపాయాలు లేవని, ఈ విషయంపై ఏ శాప్ ఛైర్మన్ కూడా ఎన్నడూ ఆలోచించలేదని పలువురు స్థానికులు వాపోయారు. దానికి భిన్నంగా క్రీడల అభివృద్ధికి గిరిజన ప్రాంతంలో పర్యటించిన తొలి శాప్ ఛైర్మన్ రవినాయుడన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సీవేరి అబ్రహం, జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ కొట్యాడ అప్పారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శెట్టి బాబూరావు, ఎస్‌ఏ రెహ్మాన్, టీడీపీ నాయకులు కామేశ్వరరావు, దయానిధి, తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.