- మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే లక్ష్యం
- శిక్షణా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి
- విమర్శలకు తావివ్వకుండా కేంద్రాల నిర్వహణ
- కుట్టు శిక్షణా పథకం విజయవంతం బాధ్యత ఈడీలదే
- తరుచూ శిక్షణా కేంద్రాలు సందర్శించాల్సిందే
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సవిత
అమరావతి (చైతన్యరథం): మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న సదుద్దేశంతో ప్రారంభించిన కుట్టు శిక్షణ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత స్పష్టంచేశారు. శిక్షణా కేంద్రాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీలు) తరుచూ సందర్శించాలని ఆదేశించారు. వంద శాతం మేర లబ్ధిదారులు శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి రాష్ట్ర సచివాలయం నుండి ఈడీలు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారులతో గురువారం మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, 175 నియోజక వర్గాల్లో 745 శిక్షణా కేంద్రాలు ప్రారంభమయ్యామన్నారు. త్వరలో మరిన్ని కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడిరచారు. ఈ సందర్బంగా ఆయా శిక్షణా కేంద్రాల్లో తీసుకున్న చర్యలు, హాజరు గురించి మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామిక వేత్తగా చేయాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,02,832 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందజేయడంతోపాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆశయ సాధనలో భాగంగా ఈడీలు, ఇతర బీసీ సంక్షేమ శాఖాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కుట్టు శిక్షణా కేంద్రాల నిర్వహణతో పాటు శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈడీలదే కీలకపాత్ర అని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈడీలు ప్రతి రోజూ కేంద్రాలను సందర్శించాలని, ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎండీ కార్యాలయ వాట్సాప్ గ్రూప్‌నకు పంపాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రతి వారం కేంద్రాల ప్రగతి నివేదికను డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్లకు అందజేయాలన్నారు.
విమర్శలకు తావివ్వొద్దు…
లబ్ధిదారులు వంద శాతం మేర శిక్షణ తరగతులకు హాజరయ్యేలా నిర్వహాకులు చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. లబ్ధిదారుల హాజరును ఈడీలే ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఎటువంటి ఆరోపణలకు తావివ్వకుండా శిక్షణా కేంద్రాలు నిర్వహించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. శిక్షణ పొందుతున్న లబ్ధిదారుల అభిప్రాయాలను వీడియోలుగా రూపొందించి, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం వినియోగించే ప్రతి రూపాయి సద్వినియోగం చేసే బాధ్యత ఈడీలు, ఇతర బీసీ సంక్షేమ శాఖాధికారులదేనన్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ, శిక్షణకు అవసరమయ్యే కుట్టు మిషన్లు, కత్తెర్లు, వివిధ రకాల డిజైన్లు శిక్షణా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఈడీలు, అన్ని జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.