- వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తున్న
- విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మానికి చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ… పదేళ్లుగా దేశవ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరుమీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25చోట్ల ‘గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్’ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను సీఎం చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం అని, రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, సంస్థ సభ్యులు శివ, భాస్కర్, శ్రీను, రంజిత్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.