- తాగునీరు, విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చూడాలి
- కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశం
- రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో హోంశాఖ మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అనిత ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను హోం మంత్రి సవిత ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇప్పటికే ప్రకటించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బాపట్ల జిల్లాలో వర్షం దంచికొట్టింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు మండలాల్లో భారీ శబ్దాలతో ఉరుములు, పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చినగంజాంలోని రొంపేరు కాలువ సమీపంలో పిడుగుపాటుకు గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
విజయవాడ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిరది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిరది. ఉయ్యూరు- కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిరది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో భారీ గాలులతో కూడిన వర్షం పడిరది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడిరది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో పగలే చీకటిగా మారిపోయిన వాతావరణం పట్టపగలు సైతం వాహనాలు లైట్లు వేసుకుని వెళుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి చాగల్లు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడిరది. నిడదవోలు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది.