- సంస్కృతీ సంప్రదాయం వెల్లివిరిసింది..
- విశ్వనగరిగా రాజధాని అవతరించనుంది
- రాష్ట్రంపట్ల మోదీకున్న బాధ్యత స్పష్టమైంది
- అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి
- దేశానికే ‘రోల్‌మోడల్‘ అన్నది ప్రశంసే కాదు
- రాజధాని ప్రాధాన్యతను మనకు గుర్తు చేయడం కూడా
- భరోసానిచ్చిన ప్రధాని మోదీజీకి ప్రత్యేక కృతజ్ఞతలు
- విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
- ఇక లక్ష్య సాధనకు ఐక్యంగా పరుగులుతీద్దాం
- టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సాగిన నిర్మాణ పనుల పున:ప్రారంభ సభతో ప్రజా రాజధాని అమరావతి ప్రాధాన్యత ప్రపంచానికి చేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ఆవశ్యకతను చాటిచెప్పాలనే ప్రధాని చేతుల మీదుగా పనులు పున:ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని ఆయన అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభ కార్యక్రమం దిగ్విజయం కావడంతో.. శనివారం సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారసత్వ సంపద అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు `రాష్ట్ర ప్రగతికి మద్దతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయని ఆనందం వ్యక్తం చేశారు. ‘అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తిగా మారుతుంద’న్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయంటూనే.. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయని ఆనందం వ్యక్తం చేశారు. నిన్నటి సభతో అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారని, దేశానికి అమరావతి రోల్ మోడల్‌గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వ కారణమన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం.. రాష్ట్ర ప్రజలపట్ల ఆయనకున్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సభ విజయం ప్రజలందరి భాగస్వామ్యమని అంటూనే.. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేసిందని చంద్రబాబు ప్రశంసించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి.. సభ విజయవంతానికి అహరహం కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, భాగస్వామ్యపక్షాల నేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రులు, నేతలకు అప్పగించిన పనులను బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశారని కితాబిచ్చారు. లక్షలాది ప్రజలు పోటెత్తినా.. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం సంతోషాన్నిస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పధంతో కార్యక్రమం జరిగిందని అంటూ.. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంతో అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు పార్థసారధి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, నారాయణలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ.. పనుల పున:ప్రారంభోత్సవ సభను విజయవంతం చేసినట్టే.. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు జరపాలని సూచించారు. ‘ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది’ అంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు నివేదించారు.