- ప్రతి ఫిర్యాదు పరిశీలించి పరిష్కరిస్తాం
- ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
- మర్రిపూడిలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
ప్రకాశం/మర్రిపూడి (చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా… మంత్రి డోలా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. తాజా గ్రీవెన్స్‌లో మొత్తం 250కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించాం. వాటిలో 100కి పైగా రెవిన్యూ సమస్యలే ఉన్నాయి. వీటిపై జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడితే పరిష్కరిస్తామని చెప్పారు. 25 రెవెన్యూ వినతులు పరిష్కరించాం, మరో 70 వినతులు 15 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ వంటి సమస్యలు కూడ త్వరలో పరిష్కరిస్తాం. భూ ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ జరిపి నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పొన్నూరులో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు, ఐవీఆర్‌ఎస్ ద్వారా కాల్ చేసి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమరావతి పున : ప్రారంభ సభకు వచ్చిన జన సందోహం చూసి వైసీపీ నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. రూ.49 వేల కోట్ల పనులతో అమరావతికి పునరుజ్జీవం మొదలైంది. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు విజన్‌తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకోవడం తథ్యం. అమరావతి, పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని మంత్రి డోలా అన్నారు.