- ఆర్టీసీ అధికారుల సమావేశంలో మంత్రి మండిపల్లి
- పాల్గొన్న ఎమ్మెల్సీలు ఆలపాటి, బీటీ నాయుడు
తెనాలి (చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణం కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పనుల పున:ప్రారంభంలో పాల్గొనేందుకు 175 నియోజకవర్గాల నుంచి అమరావతికి తరలివచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రజా రవాణాకు అవసరమైన మేర పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ సభకు రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, ఆర్టీసీ అధికారులు, గుంటూరు ప్రాంతీయ మేనేజర్, డిపో మేనేజర్లు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ రౖౖెతుల కలలను సాకారం చేసే సమయం వచ్చిందన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రాజధాని కలను ఇప్పుడు మళ్లీ పునరుజ్జీవింపచేస్తున్నాం. రాజధాని పునఃనిర్మాణం ప్రపంచ చరిత్రలో నిలిచే ఘట్టం అవుతుంది. ఇందు కోసం ప్రతీ అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.