- రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, తెలుగు ప్రజలకు మేలు
- వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ అంగీకారం
అమరావతి(చైతన్యరథం): యానాంలో జిప్‌మెర్ సూపర్ స్పెషాలిటీ సేవలు అం దించడానికి అవసరమైన సాయాన్ని సమకూర్చటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అంగీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (పాండిచ్చేరి)లో భాగమైన యానాంలో ప్రఖ్యాత జిప్‌మర్(జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) నిర్మించిన 100 పడకల సూపర్‌స్పెషాలిటీ సెంటర్ ద్వారా ప్రజలకు సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కోరింది. ఈ విషయంపై యానాం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి మాజీ ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరిలోని జిప్‌మెర్ డైరెక్టర్ వి.యస్.నేగి, ఉన్నతాధికారులు బుధవా రం మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి, డీఎంఈ నరసింహం ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సచివాలయంలో చర్చించారు. యానాంలో జిప్‌మర్ సెంటర్ నిర్మాణం పూర్తయిం దని, వివిధ మల్టీ స్పెషాలిటీ విభాగాల్లో సేవలందించడానికి అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని కృష్ణారావు కోరారు. యానాం జనాభా 80 వేలు మాత్రమే అయినప్ప టికీ ఆనుకుని ఉన్న ఏపీ జిల్లాల నుంచి భారీస్థాయిలో పలు అవసరాల కోసం ప్రతిరోజూ యానాంకు వస్తారని, జిప్‌మర్ కేంద్రం సేవలు తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.91 కోట్ల ఖర్చుతో యానాంలో నెలకొల్పిన జిప్‌మెర్ సూపర్ స్పెషాలిటీ కేం ద్రం అందించనున్న సేవలు, తద్వారా ప్రజలకు ఒనగూరే మేలు, ఈ కేంద్రాన్ని నడ పటానికి అవసరమైన డాక్టర్లు, నర్సులు, పారా టెక్నికల్ సిబ్బంది వివరాలను డైరెక్టర్ నేగి వివరించారు. ఈ కేంద్రం ద్వారా అందించే సేవలు పొందే వారిలో 75 శాతం మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారని, ఈ కేంద్రాన్ని నడపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రయో జనం ఉంటుందని చెప్పారు.
ప్రసూతి సేవలు, పిల్లల వైద్యం, మత్తు వైద్యం, శస్త్ర చికిత్స వంటి వివిధ సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు, నర్సులను ఏపీ ప్రభుత్వం డెప్యుటేషన్‌పై నియమించాలని కోరారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్‌పీ) కింద పీజీ విద్యార్థులను యానాం కేంద్రంలో నియమించాలని కోరా రు. వారికి తగు వసతి సదుపాయాలతో పాటు, డెప్యుటేషన్ అలవెన్స్‌తో కూడిన జీతభ త్యాలను పుదుచ్చేరి ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యానాం కేంద్రాన్ని నెట్‌వర్క్ ఆసుపత్రిగా గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిం చే సాయానికి బదులుగా ప్రభుత్వ వైద్యులను లెప్రోస్కోపీ, అయవ మార్పిడి చికిత్సలు, రోబోటిక్ సర్జరీల వంటి విభాగాల్లో పుదుచ్చేరిలోని యానాంలోని జిప్‌మర్‌లో శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జిప్‌మర్ శిక్షణ వల్ల ఆంధ్రప్రదేశ్ వైద్యులకు ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. జిప్‌మెర్ యానాం కేంద్రం ద్వారా చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలకు కలిగే ప్రయోజనాలతో పాటు ప్రఖ్యాత జిప్‌మర్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు లభించే ఆధునిక శిక్షణ, సీనియర్ రెసిడెన్సీ, డీఆర్‌పీ ప్రోగ్రాంల కింద రాష్ట్ర వైద్య విద్యార్థులకు జిప్‌మర్ సర్టిఫికెట్ ద్వారా ఒనగూరే ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని తగు సాయాన్ని అందిం చడానికి మంత్రి అంగీకరించా రు. ఈ మేరకు నిర్దిష్ట ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి సూచించారు.