- ప్రభుత్వ ఆర్డర్లు సేకరించి క్లాత్ సరఫరా చేయాలి
- చేనేత బజార్లలో విస్తృతంగా వస్త్ర విక్రయాలు
- చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం
అమరావతి(చైతన్యరథం): చేనేత సహకార సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఇటీవల చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ఆర్పీ సిసోడియా బుధవారం మర్యాపూర్వకంగా సచివాలయంలో మంత్రి సవితను కలిశారు. ఈ సందర్భంగా చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మంత్రి సవిత మాట్లాడుతూ చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. ఇందుకు అనుగుణంగా పలు పథకాలు రూపొందించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆప్కో ద్వారా విక్రయాలు పెంచండి
ఆప్కోలో ప్రక్షాళన చేపట్టాలని, చేనేత వస్త్ర విక్రయాలు పెరిగేలా చేనేత బజార్లు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు ఆర్డర్ల మేరకు త్వరితగతిన ఆప్కో ద్వారా క్లాత్ సరఫరా చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లకు దుప్పట్లు, టవళ్లు, ఇతర అవసరాలకు అవసరమయ్యే క్లాత్‌ను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన క్లాత్‌కు సంబంధించి ఆర్డర్లు సేకరించి ఆప్కో ద్వారా సప్లయ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో పెద్ద పెద్ద నగరాల్లో చేనేత బజార్లు నిర్వహించాలని, రాష్ట్రంలో క్లస్టర్ల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు సిద్ధమవ్వాలన్నారు. ఇందుకు కోసం సొసైటీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు.
హస్త కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇప్పించండి
రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి ప్రభుత్వం పీట వేస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా లేపాక్షిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తెలిపారు. కస్టమర్లను ఆకట్టు కునేలా హస్త కళారూపాల తయారీకి కళాకారులను అవసరమైన నైపుణ్య శిక్షణ అందజేయాలన్నారు. ముఖ్యంగా వెదురు, అరటి ఫైబర్‌తో తయ్యారయ్యే కళారూపాలను నేటి అభి రుచులకు అనుగుణంగా రూపొందించేలా చూడాలని ఆదేశించారు.