విశాఖపట్నం(చైతన్యరథం): ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి(అప్పన్న)కి టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ 1996 నుంచి టీటీడీ తరపున వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామి వారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి వారి తరపున టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్‌చార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.