- బుడమేరుకు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్
- బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలి
- అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునికీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామా నాయుడు బుధవారం సమీక్షించారు. ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. బుడమేరు మూడు గండ్ల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవ్వడంతో పనులు వెంటనే మొదలు పెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండిరగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలా డీపీఆర్ తయారు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్‌కు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌ంట్ శాఖలు సమన్వయంతో ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు జూన్‌లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో ఏజెన్సీలు సరిపడా మ్యాన్ పవర్, మెషినరీ, బ్యాచింగ్ ప్లాంట్లు, టిప్పర్లు, రోలర్లు, ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి నిమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.