అమరావతి (చైతన్య రథం): ‘ద సీబీఎన్ వే.. ప్రిన్సిపిల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇన్ఫోలోబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పసలపూడి సత్యేంద్ర రచించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని పురష్కరించుకుని ఆయన విద్యాభ్యాసం, రాజకీయ నేపథ్యం, చేపట్టిన ప్రాజెక్టులు, ఐటీ పాలసీ, ఈ-గవర్నెన్స్, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, వృద్ధిరేటు పెరుగుదలకు తీసుకున్న చర్యలు, పీపీపీ విధానం, వ్యవసాయంలో సాంకేతికతను తెచ్చి రైతుల ఆదాయం పెంపుదల, బుడమేరు వరదల సమయంలో టెక్నాలజీ వినియోగించి బాధితులను ఆదుకున్న ఘటనలు, విజన్ 2020, విజన్ 2047 వంటి వాటి గురించి పుస్తకంలో సత్యేంద్ర వివరించారు. మొత్తం 3 విభాగాలుగా 15 అధ్యాయాల్లో పుస్తకాన్ని రచించారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ కంపెనీల కారణంగా తాను హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం పొందినట్లు సత్యేంద్ర వివరించారు. సత్యేంద్ర స్వస్థలం కాకినాడ. అవకాశాలను అందిపుచ్చుకుని తాను మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినట్టు సత్యేంద్ర తెలిపారు.