- సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత
- హోంమంత్రి అనిత వెల్లడి
విశాఖపట్నం (చైతన్యరథం): సింహాచలంలో కొలువు తీరిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. ఆదివారం సింహాచలంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లును ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఈ నెల 30న స్వామివారం చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శ్రీ వరహా లక్ష్మి నరసింహాస్వామి వారిని భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అంతరాలయ దర్శనాలు ఉదయం ఆరు గంటలతో ముగిస్తాయని స్పష్టం చేశారు.
సింహాచలం పరిసర ప్రాంత్రాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇక భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ చందనోత్సవం సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో దేవస్థానం ఉన్నతాధికారులు ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం ఈ చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారని మంత్రి అనిత గుర్తు చేశారు. ఈ ఏడాది స్వామి వారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇటీవల వివిధ ఆలయాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు.
అంతకు ముందు స్వామి వారిని దర్శించుకునేందుకు సింహాచలం దేవాలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. మంత్రి అనితకు స్వామి వారి చిత్ర పట్నాన్ని, ప్రసాదాన్ని ఆమెకు ఆలయ అధికారులు అందజేశారు.
ఈ నెల 30వ తేదీన సింహాచలంలో అప్పన్న చందనోత్సవం జరగనుంది. ఏడాది పొడవునా చందనరూపుడై ఉండే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆ ఒక్కరోజే భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. అందుకోసం రాష్ట్రం నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివస్తారు.ఈ నేపథ్యంలో ఏర్పాట్లను హోం మంత్రి అనిత సమీక్షించారు.