గుంటూరు (చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే రాజధాని అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవ సభలో పాల్గొనడానికి లక్షలాది ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పెదకాకాని లో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులతో కలసి పాల్గొన్న మంత్రి నిమ్మల మాట్లాడుతూ నాడు జగన్ ప్రతిపక్షంలో ఉండగా, అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పి అమరావతి రాజధాని కాదంటూ మూడు రాజధానుత పేరుతో మూడుముక్కలాట ఆడాడని విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని, భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రంలోని 16,816 గ్రామాలకు అందిస్తుందన్నారు. వైసీపీ పాలన అంతా విధ్వంసం అయితే, కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తోందని తెలిపారు. రైతు కంట కన్నీరు, తల్లి కంట కన్నీరు మంచిది కాదన్నా వినకుండా నాడు జగన్ విధ్వంసం సృష్టించాడని విమర్శించారు. 5 ఏళ్ళ వైసీపీ పాలనలో రూ.14 లక్షల కోట్లు అప్పు పెట్టారని, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి తలపై జగన్, రూ.2 లక్షల 40 వేలు అప్పు పెట్టాడని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మంత్రులు ఎవరు ఏ శాఖ నిర్వహించేవారో తెలిసేది కాదు. ఆయా శాఖలపై, అభవృద్ధి పనులపై ఒక్క సారి కూడా సమీక్ష చేసిన దాఖలాలు లేవు, కనీసం ఆయా శాఖలపై ఆ మంత్రులకు పట్టుకూడా ఉండేది కాదని ఎద్దేవా చేశారు. నాడు ధూళిపాళ నరేంద్రను జగన్ కర్కసత్వంగా, అక్రమ కేసులు పెట్టి, పైశాచిక ఆనందం పొందిన రోజులు ఇంకా గుర్తున్నాయని అన్నారు. తెలుగు జాతి గర్వించేలా, చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునర్నిర్మాణ సభ జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.