తెలుగు సంస్కృతిలో పెనవేసుకుపోయిన పేరు అమరావతి. కొత్త రాజధానికొక కొత్త పేరు కావాలి. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలవనున్న పేరు. రాష్ట్రం మూలమూలలోని ప్రతి పౌరుడూ తనదేనని భావించే పేరు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప పేరు. మానవ జాతి మూలాలనుండీ నేటివరకూ మన సంస్కృతితో మన చారిత్రక వైభవాన్ని స్ఫురణకు తెచ్చేపేరు. సగానికి పైగా ప్రపంచానికి నాగరికతను నేర్పిన ఆ పేరే అమరావతి. ఆ పేరు తలుచుకుంటే చాలు ప్రజాజీవనంలోనూ, సాంస్కృతికరంగంలోనూ, భారతీయ చరిత్రలోనే సర్వోత్కృష్టమైన ఒక మహాయుగం మన కనులముందు మెదుల్తుంది. అజరామరం- అమరావతి. 2019-24 మధ్యకాలంలో విధ్వంస పాలకుల చేతిలో శిధిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునర్జీవం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మీదుగా రూ.లక్ష కోట్ల పనులకు శ్రీకారం చుడుతున్నది కూటమి ప్రభుత్వం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతే నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా మారబోతుంది. ఆ మలుపునకు కారణం, కార్యము కూడా తానే అయి నిలిచిన క్రాంతదర్శి నారా చంద్రబాబు నాయుడు.
ఆ కర్మవీరుడు మరో వెయ్యేళ్ళు దీర్ఘకాలిక భవితవ్యాన్ని స్వప్నించి సాకారం చెయ్యబోతున్న మహానగరం అమరావతి. రాజధాని నిర్మాణం అనేది ఒక సువర్ణావకాశం. మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. వేల సంవత్సరాల కాలగమనంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని, బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహించుకోకపొతే చరిత్ర క్షమించదు. అమరావతి రూపంలో ఒక మహానగరాన్ని నిర్మించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ దక్కింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. ఆ చారిత్రిక సృహ, ఆ దార్శనికతవున్న నాయకుడు నేడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు. కావునా ఆ అద్భుతానికి సమకాలీకులమై, సాక్షులమై, సారథులౌదాం. మాకు అమరావతి అంటే గోడలు, నీడలు కాదు. రెండువేల సంవత్సరాల మహోజ్వల చరిత్ర. వర్తమానంలో తీసుకుంటున్న మరో మలుపు, కోట్లాది ఆంధ్రులకు వర్తమానంలో దక్కిన మరో గెలుపు, మరో వెయ్యేళ్ల భవిష్యత్తుకి మేలుకొలుపు. మన జాతిని, దక్షిణాదినే కాదు, ఏకంగా 40కి పైగా దేశాల గమ్యాన్ని, గమనాన్నీ నిర్దేశించింది నాటి అమరావతి. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతం కాబోతోంది. అందుకే ప్రపంచం చూపు ఇప్పుడు మన అమరావతిపై ఉంది.
అమరావతి మీద నలుదిక్కుల చూపు సోకుతోంది, అన్ని జాగ్రత్తలు తీసుకొని తల్లీబిడ్డను కలిపే బొడ్డుతాడులా జాతిని, చరిత్రను అనుసంధానిస్తూ అమరావతితో దేశ ప్రజల భావోద్వేగాలను కలపడానికి పదేళ్లనాడే దేశ నలుమూలలా వున్న నదీ నదాలలో ఉప్పొంగే పవిత్ర జలాలు, పుట్టమట్టితో పెద్దలు చేసిన ప్రార్ధనలతో ఆవిర్భవించిన అపురూప అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించారు సీయం చంద్రబాబు. వైసీపీ విధ్వంస విధానాలతో నిలిచిపోయిన అమరావతి పునర్నిర్మాణాన్ని మూడేళ్ళలో పూర్తిచెయ్యాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు పరుగులు పెట్టించబోతున్నారు. ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళికలు రూపొందించారు చంద్రబాబు.
ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేశంలోనే తొలి అత్యాధునిక, సాంకేతిక నగరం కాబోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అలరారే అరుదైన రాజధానులు- టోక్యో, ఇస్లామాబాద్ ఆసియా, రోమ్, ఫ్రాన్స్, లండన్, బెర్లిన్ (యూరప్), మాస్కో (యూరప్- ఆసియా), వాషింగ్టన్, ఒట్టవా (అమెరికా)లకు అమరావతి దీటుగా నిలవనున్నది. కానీ, ఆ రాజధానులు వేటికీలేని విశిష్టత ఉన్న మహోజ్వల నగరం అమరావతి. మట్టి పరిమళాల పల్లెలు అంతర్భాగమైన, భిన్నత్వంలోని ఏకత్వాన్ని సొంతం చేసుకున్న అచ్చమైన భారతీయ, ఆదర్శ నగరం- అమరావతి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అనివార్యమైంది. ముఖ్యమంత్రి కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. అటువంటి దుస్ధితిలో రాష్ట్రపగ్గాలు స్వీకరించిన చంద్రబాబు, ప్రజలందరి ఆకాంక్షలు ప్రతిబింబించే ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు. అద్భుత నగరి అమరావతి సాకారమయ్యేలా బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ.. ఏపీ సీఆర్డీఏను నెలకొల్పారు పదేళ్లనాడే. రాజధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.
ప్రభుత్వం వద్ద అరచేత గుడ్డి గవ్వ అయినా లేకున్నా.. ప్రపంచంలోనే తొలిసారిగా 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన ఘనత అమరావతి రైతులకే దక్కింది. నిజానికి భూసమీకరణ ప్రక్రియ ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల అమలైనప్పటికీ అమరావతి కోసం చేసినంత భారీస్థాయిలో ఎక్కడా జరగలేదు. ఈ భూసమీకరణ విధానాన్ని అనుసరించేందుకు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు అధ్యయనం చేయడం.. దేశ విదేశీ ఆర్థిక నిపుణులు ప్రశంసించడం చంద్రబాబు విజన్‌కు నిదర్శనం. కృష్ణా నది తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647 ఎకరాలలో రూపు దిద్దుకొంటున్న అమరావతి రాజధాని రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేపట్టారు. భవిష్యత్ అవసరాలు, ఎదురుకాబోయే సవాళ్ళను ఎదుర్కొనే విధంగా, ఢల్లీి, కోల్‌కతా, బెంగుళూరువంటి అనేక నగరాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు ఏవీ అమరావతి చరిత్రలో ఎదుర్కోకూడదన్న విధంగా ప్రణాళిక రచించారు. ఇప్పుడున్న జనాభా కోటికి పెరిగినా ఢోకాలేని విధంగా నగర నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అమరావతి విజ్ఞాన సమాజానికి వేదిక కానున్నది. ఉత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయస్థాయికి పలు ఉన్నత విద్యా సంస్థలు అమరావతిలో కొలువు తీరనున్నాయి. అక్కడికి విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత్‌వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ యూనివర్సిటీ, లా స్కూలు వంటి దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్‌లు అక్కడికి రానున్నాయి. కృష్ణా నది తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647ఎకరాలలో రూపుదిద్దుకొనున్న అమరావతి రాజధానికి నవనగరాలు నవ నాగరీకంగా నిలవనున్నాయి.
అమరావతి పునర్నిర్మాణం మే రెండవ తేదీనుండి గేరు మార్చబోతున్నది. అమరావతిలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌గా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అమరావతికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయినా అంతిమంగా మాత్రం అడుగు బలంగా పడబోతోంది. మొదటి అడుగుతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి అనుపానులు కళ్లముందు కనిపించడానికి మరో మూడేళ్లు పట్టవచ్చు. రాజధాని అంటే కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా డైనమిక్‌గా ఉండబోతుంది. ప్రతి తెలుగువాడు మాకు అమరావతి గొప్ప రాజధాని ఉందని గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రపంచంలో టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. చక్కటి జనావాసాలతో, విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజారవాణా, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్ధాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికి తొమ్మిది ధీమ్ సిటీలను, 27టౌన్ షిప్‌లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.
5-10-15 కాన్సెప్ట్‌తో అత్యవసర సేవలకు 5 నిముషాలు, వినోద, విహార ప్రదేశాలకు పది నిముషాలు, కార్యాలయాలకు 15నిముషాల్లో ప్రజలు కాలి నడకన చేరుకునేలా ప్రణాళిక తయారు చెయ్యడం అమరావతి నగరం ప్రత్యేకత. వెయ్యేళ్ళ ముందు చూపుతో పగడ్బందీ వ్యూహాలతో సమకాలీన భారతదేశంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొన్న ఇబ్బందులు సమస్యలు, తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అందుకు సులభ, సుస్థిర జీవనానికి కావాల్సిన ప్రతి అంశాన్నీ ప్రాధాన్యతగా తీసుకొని ప్రజారాజధానిని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్ధిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటకవంటి తొమ్మిది ధీమ్ సిటీలను నిర్మించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచానికే గర్వకారణం కానున్నది. రాజధాని నిర్మాణం జరగకూడదని కొందరు ప్రభుద్దులు ఉద్దేశ్యపూర్వకంగా పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్నారు. కావునా అమరావతిపై విషం చిముతున్న విష పురుగులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అమరావతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అంతిమంగా మాత్రం విజేతగా నిలిచింది అమరావతి. మొన్నటి ఎన్నికల్లో తెలుగు ప్రజలు తెలివిగా వ్యవహరించి రాజధాని అమరావతి నిర్మాణ సారధ్యాన్ని దార్శనికుడు, పాలనాదక్షుడు చంద్రబాబు చేతిలో పెట్టారు.
`నీరుకొండ ప్రసాద్