- వేట నిషేధభృతి రూ.20 వేలకు పెంపు
- జీవో 217 తెచ్చి మత్స్యకారుల జీవనోపాధి మీద దెబ్బ కొట్టిన జగన్
- దానిని రద్దుచేసి అండగా నిలిచిన చంద్రబాబు
- మత్స్యకారుల సంక్షేమం కూటమి పాలనతోనే సాధ్యం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి (చైతన్యరథం): సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే గంగపుత్రులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందే ఉంటారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధకాల భృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 వేల నుంచి 20 వేలకు పెంచారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ మత్స్యకారులకు చేసిందేమీ లేకపోగా కనీసం వేట నిషేధకాల భృతిని కూడా సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు. పైపెచ్చు జీవో 217 తెచ్చి రాష్ట్రంలో సొసైటీ ఆధ్వర్యంలో నడిచే చెరువులు, జలాశయాలు వైసీపీ నేతలకు అప్పజెప్పి మత్స్యకారుల జీవనోపాధి మీద జగన్ దెబ్బ కొట్టారన్నారు. నేడు చంద్రబాబు నాయుడు ఆ జీవో రద్దు చేసి మత్స్యకారులకు అండగా నిలిచారు. గత టీడీపీ హయాంలో మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. మత్స్యకారులకు సబ్సిడీతో పడవలు, వలలు, ఐస్ బాక్స్ లు, డీజిల్ అందించాం. రూ.5 లక్షల చంద్రన్న బీమా అమలు చేశాం. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేశాం. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. మత్స్యకారుల సంక్షేమం కూటమి పాలనతోనే సాధ్యమని ఒక ప్రకటనలో మంత్రి డోలా స్పష్టం చేశారు.