- ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తున్నా..
- వేట నిషేధ సమయంలో రూ.20,000 ఆర్థిక సాయం
- రూ.259 కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నాం
- 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ది
- గత పాలకుడిలా నేను బటన్ నొక్కను
- మిమ్మల్ని కలిస్తేనే సమస్యలు తెలుస్తాయి…
- ఎచ్చెర్లలో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా
- సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ
- బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో..’ పథకం ప్రారంభం
ఎచ్చెర్ల- బుడగట్లపాలెం (చైతన్య రథం): రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం రెట్టింపు చేసి.. విడుదల చేశామని, దీనివల్ల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. గత పాలకుడిలా తానూ బటన్ నొక్కొచ్చని, కానీ అలా చేయడంకంటే ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకోవడమే తన విధానమన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తన ధ్యేయమని వివరిస్తూ.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో ‘మత్స్యకార సేవలో..’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మత్స్యకారులు తురాడ అప్పన్న, అలుపల్లి తవితాయ కుటుంబాలకు చెరో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
‘మత్స్యకారుల కష్టాలు నాకు తెలుసు. జాలర్లు ప్రాణాలను ఫణంపెట్టి సముద్రంలో వేటకు వెళ్లడం, వారు తిరిగి వచ్చే వరకూ ఆడబిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూడటం నేను స్వయంగా చూశాను. కొందరు బోట్లను కొని మీ ఆదాయం సగం కొట్టేస్తున్నారు. మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నాను. జాలర్లు మాటకు కట్టుబడి ఉంటారు. మత్స్యకార గ్రామాలకు గ్రామాలు టీడీపీకి అండగా నిలబడ్డాయి. వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం ధ్యేయం. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచాం’ అని చంద్రబాబు వివరించారు.
అభివృద్ధి అంటే.. బటన్ నొక్కడం కాదు
గత పాలకుల్లా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం నాకూ వచ్చు. కానీ చేయాల్సింది అది కాదు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే నా ధ్యేయం. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ.300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిరదా? 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశపెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టాము. అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్‌బాక్సులు అదనంగా ఇచ్చాం. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా 6 రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నాము. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నాము. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నా’మని చంద్రబాబు వివరించారు.
చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్
రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి. అయినా నేను బుడగట్లపాలెంకు ఎందుకొచ్చానంటే ఇక్కడినుంచే జాలర్ల దశ దిశా మార్చాలని. చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందువరుసలో ఉంది. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం మన రాష్ట్రంనుంచే ఉంటోంది. ఏపీనుంచే 32 శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినాలి. మనుషుల్లో తెలివితేటలు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే చేపలు తినాలి’ అని చంద్రబాబు అన్నారు.
దేశమంతా శ్రీకాకుళం వాసులే..
హైదరాబాద్, ఢల్లీి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో శ్రీకాకుళం వాసులున్నారు. జిల్లాలో తెలివితేటలున్న నాయకులుకు కొరత లేదు. నాగావళి, వంశధార ద్వారా నీరు సమృద్ధిగా వస్తుంది. జిల్లా వెంబడి ఎక్కువ జాతీయ రహదారులు ఉన్నాయి. బంగారం పండే భూములు, గనులున్నాయి. ఇక్కడి ఎమ్మెల్యే ఈశ్వరరావు మంచి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి. ఈ జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త అప్పలనాయుడు ఎంపీ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి అయ్యాడు. విశాఖవాసులు తలసరి ఆదాయంలో ముందుంటే రాష్ట్రం మొత్తంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా శ్రీకాకుళం. నేను భోగాపురం ఎయిర్ పోర్టు తీసుకొస్తే గత పాలకులు దాన్ని అటకెక్కించారు. మళ్లీ నేనే దాన్ని పూర్తిచేస్తాను. ఆనాడు నా మిత్రుడు ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఉద్దానంకు నీళ్లు తెచ్చారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం పూర్తి కాబోతోంది. రామ్మోహన్‌నాయుడు పనితీరును ఢల్లీి నాయకులు గొప్పగా చెబుతున్నారు. అయితే శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ తిరిగి ఇవ్వాల్సిందేనని రామ్మోహన్‌కు నేను తేల్చి చెప్పాను’ అని చంద్రబాబు చమత్కరించారు.
గత పాలకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు
‘ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి పది నెలలైంది. ఎన్నో సమస్యలున్నాయి. 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న నాకే సమస్యలు అర్ధం కావడంలేదు. గత ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది. ఆ సొమ్ము ఏంచేశారో లెక్కలు లేవు. నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని సమస్యలున్నా ప్రజలను ఆదుకుంటాను. ఇలాంటి సభలు గడిచిన ఐదేళ్లలో ఎలా జరిగాయో మీకు తెలుసు. గత పాలకులు వస్తున్నారంటే మీ కొబ్బరిచెట్లు గోవిందా… ఒక నాయకుడు వస్తే చెట్లు నరికేయడం, పరదాలు కట్టేయడం చూశాం. కొందరిని ఇంట్లోనుంచి బయటకు రానివ్వకుండా నెత్తిన చెయ్యి పెట్టేవారు. ఐదేళ్లూ అభివృద్ధి ఆగిపోయింది. పెట్టుబడులు లేవు. పరిశ్రమలు పారిపోయాయి. దీనివల్ల చాలా నష్టం జరిగింది. 2019 తర్వాత కూడా టీడీపీ అధికారంలో ఉండుంటే రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగేది. దీనివల్ల ప్రతి ఇంటికి రూ.50నుంచి 70వేలు తలసరి ఆదాయం పెరిగేది’ అని చంద్రబాబు వివరించారు.
ఎచ్చెర్లను అభివృద్ధి చేస్తా..
‘ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజల తలసరి ఆదాయం తక్కువ ఉంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. నియోజకవర్గంలో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. 9 ఫిషింగ్ హార్బర్లు సిద్ధం చేస్తున్నాం. బోట్లు కొనిచ్చి గ్రామాన్ని ఒక సెంటర్‌గా తీసుకుని ఆర్థికంగా ఆదుకుంటాం. ఈ గ్రామంలో 499 ఇళ్లున్నాయి. 18మందికి ఇంటి జాగా లేదు. 6 నెలల్లోగా ఇళ్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బాగా పనిచేస్తున్నారు. మిత్రపక్షాలను కలుపుకుపోతున్నారు. రిజర్వాయర్లు సహా కాలువలు పూర్తిచేసి ఎచ్చెర్లను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకుంటా’మని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అందరికీ సంక్షేమం అందిస్తాం
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 200కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, పేదలకు రూ.4,000 పింఛన్లు ఇస్తున్నామని, దీపం`2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. టీచరు పోస్టులు భర్తీ చేస్తున్నామని, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదిలో మూడు విడతల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు. జూన్‌నాటికి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు అందిస్తామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 270 సేవలు అందిస్తున్నామని వివరించారు. వాటిని 1,000కి పెంచుతామన్నారు. భావనపాడులో పోర్టు కట్టాలనుకున్నా.. గత పాలకులు దాన్ని మూలపేటకు తెచ్చారని అన్నారు. ఐదేళ్లు ఆలస్యమైందని, రాబోయే సంవత్సరంలో మూలపేట పోర్టు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ వస్తోందని, దీనివల్ల 40 వేలమందికి ఉపాధి లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు.