- ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చినవారు పేదలకు చేయూతనివ్వాలి
- రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి
- బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు
ఎచ్చెర్ల (చైతన్య రథం): ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చినవారు సమాజంలోని పేదలకు చేయూతనిచ్చి, అభివృద్ధిలోకి తెచ్చేందుకు చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో..’ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి. పేదలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే కాకుండా మార్గదర్శుల ద్వారా సాయం అందించి అన్ని విధాలా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఏం చేస్తున్నాయో కూడా సమీక్ష చేస్తాం. 2029నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. అన్ని విధాలా ఆర్థికంగా పైకొచ్చిన వారు పేద కుటుంబాలను ఆదుకుంటే సమాజంలో అసమానతలు ఉండవు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం మార్గదర్శులకు సీఎం చంద్రబాబు శాలువాలు కప్పి సన్మానం చేశారు.
బంగారు కుటుంబానికి ఎంపికైన అలుపు లచ్చమ్మ మాట్లాడుతూ ‘నా భర్త ఉపాధి కోసం గుజరాత్ వెళ్లారు. నేను ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటాను. మాది పేద కుటుంబం’ అని చెప్పుకుంది. సూరాడ అప్పన్న మాట్లాడుతూ.. ‘మాకు అమ్మానాన్నలు లేరు. మా అక్కకు 15 ఏళ్ల క్రితమే పెళ్లైంది. కానీ రెండేళ్లకే మానసిక సమస్య తలెత్తడంతో.. ఆమెను భర్త వదిలేశాడు. ప్రస్తుతం ఆమె, పిల్లలు మావద్దే ఉంటున్నారు. నా భార్య బీఎస్సీ కంప్యూటర్ చేసింది. నేను, నా తమ్ముడు వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. 8మందిమి ఇరుకింట్లోనే ఉంటున్నాం. మా అక్కకు పింఛను ఇప్పించిండి’ అని వేడుకున్నాడు. సమస్యను విని చలించిపోయిన సీఎం చంద్రబాబు ‘మీ సోదరికి వెంటనే పింఛను మంజూరు చేస్తున్నా. ఇల్లు నిర్మిస్తా’మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్గదర్శి గురిపూడి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ.. ‘నేను టీచర్‌గా పని చేసి రిటైరయ్యాను. ఈ ప్రాంతంలో డిగ్రీ, పీజీ, డిప్లమో, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులతో కాలేజీ పెట్టాం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ఆలోచన. నేను 25 కుటుంబాలను దత్తత తీసుకుంటాను.
అప్పన్న ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేసి ఆయన భార్యకు నైపుణ్యంపెంచి మా వ్యవసాయ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా, ప్రోగ్రామర్‌గా అవకాశం కల్పిస్తాం. వారి పిల్లలను మా కాలేజీలో ఉచితంగా చదివిస్తాం’ అని ప్రకటించారు. మరో మార్గదర్శి పీవీఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ ‘నేను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. 1995-2004 మధ్య సీఎం చంద్రబాబు ఐటీ స్కిల్ డెవలెప్మెంట్ కార్యక్రమం చేపట్టారు. మేము అబ్రాడ్‌లో కంపెనీ పెట్టాం. 2018లో పైడి భీమవరంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ పెట్టాం. కోవిడ్ సమయంలో మా పరిశ్రమ ద్వారా ఆక్సిజన్ అందించాం. చంద్రబాబుకు మేం రుణపడి ఉన్నాం. మా పరిశ్రమ తరపున లచ్చమ్మ కుటుంబానికి సాయం అందించడంతోపాటు 20 కుటుంబాలను దత్తత తీసుకుంటాం. మత్స్యకారులకు టూల్ కిట్స్, బోట్స్, వారి పిల్లలకు చదవును అందించడంతో పాటు స్కాలర్ షిప్స్ అందిస్తా’మని ప్రకటించారు.