ఒంగోలు (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెదేపా నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో ఒంగోలు పోలీసులు కొంత పురోగతి సాధించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం తరలించే మాఫియాకు చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు. గతంలో వాసు అనే బియ్యం వ్యాపారిని ఈ మాఫియా హత్య చేసింది. తాజాగా ఆ కారణంగానే వీరయ్య చౌదరి సైతం హత్యకు గురైనట్ల పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరయ్య చౌదరి హత్య అనంతరం ఒంగోలుకు చెందిన ఓ రేషన్ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి కనిపించకుండా పోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అతడి ఆచూకీ గుర్తించేందుకు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను సాంకేతికంగా పరిశీలించిన క్రమంలో అతడికి సన్నిహితులుగా ఉన్న ఐదుగురిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఒంగోలుకు తరలిస్తున్నారు. ఈ ఐదుగురిని విచారించడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.
వెలుగుచూస్తున్న రాజకీయ కోణం
వీరయ్య చౌదరి హత్యోదంతంలో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది. నాగులుప్పలపాడు మండల వైకాపా నేత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ నేత పరారీలో ఉన్నాడు. అతడు వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చాకా అదే దందా కొనసాగించాడు. ఆయన వ్యాపారానికి వీరయ్యచౌదరి అడ్డుకట్ట వేశారు. దీంతో తెదేపాలోకి వచ్చేందుకు యత్నించాడు. అతడు రాకుండా వీరయ్య చౌదరి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితుల కోసం 12 బృందాలతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
హత్య ఎలా జరిగిందంటే..
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది. స్థిరాస్తి వ్యాపారం చేసే ఈయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధికార ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశారు. ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయానికి తిరిగొచ్చారు. సాయంత్రం 7.35 గంటల సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై ముఖాలకు రుమాళ్లు కట్టుకొని నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తూనే వీరయ్యచౌదరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై పదిహేనుసార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నారు. అతని కేకలు విని పక్కన భవనంలోనుంచి ఓ యువకుడు బయటికి రాగా.. నిందితులు కత్తితో బెదిరించి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.