- భౌతిక కాయంపై 53చోట్ల కత్తిపోట్లు…
- రాష్ట్రంలో ఇంతటి ఘోరమైన వ్యక్తులున్నారా?
- తెదేపా నేత వీరయ్యచౌదరి హత్యపై సీఎం చంద్రబాబు
- కుటుంబాన్ని ఓదార్చి.. భౌతిక కాయం వద్ద నివాళి
- దుర్మార్గుల సమాచారం తెలిస్తే ఇవ్వాలని విజ్ఞప్తి
- నిందితులను పట్టుకుని శిక్షించేదాకా వదలం..
- బాధిత కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటామన్న బాబు
ఒంగోలు (చైతన్య రథం): తెదేపా నేత వీరయ్య చౌదరి హత్యోదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు వెళ్లిన ముఖ్యమంత్రి… వీరయ్యచౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు జరుగుతోందని, 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య చేసింది స్థానికులా.. కిరాయి గూండాలా.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో హింసకు తావులేదన్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
ఢిల్లీలో ఉండగా తెలిసింది.. గొప్ప నేతను కోల్పోవడం బాధాకరం
‘‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వార్త తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. హత్య జరిగిన విధానం చూస్తే.. కరడుగట్టిన నేరస్థులు సైతం చేయని రీతిలో ఉంది. భౌతికకాయంపై 53చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోంది. వీరయ్య చౌదరి మంచి నాయకుడు. సమర్థమంతమైన వ్యక్తి. యువగళం సందర్భంలో 100 రోజులపాటు లోకేశ్‌తో తిరిగారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో అండగా నిలబడ్డారు. పార్టీకి ఒక సమర్థమైన వ్యక్తిగా పనిచేశారు. ఈ మండలంలో 10వేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితులో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి నేతను కోల్పోవడం బాధాకరం. వీరయ్యచౌదరి హత్యకు కారణాల్ని పరిశీలిస్తున్నాం. వ్యక్తిగత కక్షలా.. ఆర్థిక వ్యవహారాలా? రాజకీయంగా ఎదుగుదల తట్టుకోలేక చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలిస్తే.. సమాచారం ఇవ్వండి
‘విభేదాలు వచ్చినప్పుడు హత్యలకు పాల్పడటం రాక్షస మనస్తత్వం. ఇలాంటి ఘోరాలు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించం. ఈ ఘటనలో నిందితుల గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 9121104784కు చెప్పాలని కార్యకర్తలు, సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని నూటికి నూరుశాతం పట్టుకొని శిక్షిస్తాం. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు, హత్యలు చేసే వ్యక్తులకు ఒకటే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారని గుర్తుంచుకోండి’ అని సీఎం హెచ్చరించారు.
నిందితుల్ని పట్టుకొని శిక్షించేదాకా వదలం
వీరయ్య చౌదరి భార్య, కుమారుడితో మాట్లాడుతుంటే.. అసలు వాళ్లకు ఏమీ తెలియదు. ఆయన మిత్రులు, బంధువులతో, డ్రైవర్‌తో మాట్లాడాను. ఈ ఘటన జరిగినప్పుడు ఆఫీస్‌లో ఆయనతోపాటు ఉన్న వ్యక్తినీ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా నిందితులు ముసుగు వేసుకొని ఈ కిరాతకానికి ఒడిగట్టారు. ఏదేమైనా నిందితుల్ని పట్టుకొని శిక్షించి.. వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాం. ఈ ఘటనకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా ఇవ్వండి. ఎవరినీ వదిలిపెట్టం. దొరికే వరకూ గాలిస్తాం. నిందితుల్ని పట్టుకొనే వరకు దర్యాప్తు కొనసాగుతుంది’ అన్నారు.
పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా.. అధైర్యపడొద్దు..
వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటాం. ఆదుకుంటాం. మా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటాం. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా. మీకు అండగా ఉంటాను. ఇలాంటి దుర్మార్గులు, నేర రాజకీయాలు చేసేవారిని తుదముట్టించేంత వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో గత ఐదేళ్లు చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపించింది. హత్యలు చేయడం నీచమైన, దుర్మార్గమైన చర్య. ఈ హత్యోదంతాన్ని ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదు. నిందితుల్ని పట్టుకుంటాం. శిక్షిస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.