అమరావతి (చైతన్య రథం): ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీఎం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు చంద్రమౌళి, మధుసూదన్‌కు సీఎం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.