- దేశ భద్రత విషయంలో ప్రజలు ఒక్కటవ్వాలి
- ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది
- దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవ్వరితరం కాదు…
- విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
- ఉగ్రదాడిలో అశువులుబాసిన చంద్రమౌళికి నివాళి
- కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
విశాఖపట్నం (చైతన్య రథం): జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత- భద్రత విషయంలో ఏకతాటిపైకి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక ఇలాంటిదాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి జెఎస్ చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖపట్నం వెళ్లి సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు… నివాళి అర్పించారు. చంద్రమౌళి మృతదేహంపై జాతీయజెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారు. రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారని ప్రత్యక్షసాక్షి శశిధర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక దాడులు
ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. నాలుగేళ్లుగా జమ్మూకాశ్మీర్‌లో కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఉపాధి, అభివృద్ధికి నాంది పలకడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఈ సమయంలో ఉగ్రదాడి బాధాకరం. టెర్రరిస్టులు భారత్‌ను ఏంచేయలేరు. మన దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో చేద్దామనుకోవడం వారి అవివేకం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన దేశానికి రావడం, మన ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో దాడి వెనుక కుట్ర కోణం ఉండే ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పడు దేశమంతా సమైక్యంగా నిలబడాలి. ప్రధాని మోదీ నాయత్వంలో కేంద్రం చేసే ప్రతి కార్యక్రమానికి సంఫీుభావం తెలపాలని చంద్రబాబు ఉద్ఘాటించారు.
దేశ భద్రతను దెబ్బతీయాలని చూసేవారి ఆటలు సాగవు
దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసేవారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతమున్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తాం. మేధావులు, ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. క్లిష్ట సమయంలో కేంద్రానికి పూర్తిగా సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.