- పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో భారీగా ప్రోత్సాహం
- గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు తక్షణ సాయం అవసరం
- ఆర్‌ఈఎంజెడ్ ఏర్పాటుకు సహకరించండి
- కేంద్ర మంత్రికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి వినతి
విజయవాడ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం బలోపేతానికి ఆర్థికంగా సాయం చేయాలని కేంద్రాన్ని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కోరారు. విజయవాడలో మంగళవారం జరిగిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యస్సో నాయక్‌కు ఈ మేరకు మంత్రి గొట్టిపాటి వినతి పత్రం అందజేశారు. ఏపీ పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. జాతీయ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు సమర్థవంతంగా కలిపేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఎంతో కీలకమని కేంద్ర మంత్రికి మంత్రి గొట్టిపాటి వివరించారు. అంతేగాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ జోన్ (ఆర్‌ఈఎంజెడ్) ఏర్పాటు కోసం సమగ్ర ఆర్థిక, సాంకేతిక సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆర్‌ఈఎంజెడ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ వనరుల అంచనా, షెడ్యూలింగ్, గ్రిడ్ నిర్వహణను మెరుగుపరచగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఎన్‌పీ కుంట సోలార్ పార్క్ నుంచి ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక విద్యుత్ పై జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జీఎన్‌ఏ) ఛార్జీల నుండి మినహాయించాలని కేంద్ర మంత్రి నాయక్‌కు మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. ఈ పార్క్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్.. వినియోగదారులకు అందుబాటు ధరలో ఉండాలంటే ఈ మినహాయింపు అత్యంత అవసరమని మంత్రి గొట్టిపాటి వివరించారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్న వివిధ అంశాలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.
విద్యుత్ రంగం సుస్థిరాభివృద్ధిపై కీలక చర్చ
డిస్కంల బలోపేతం, విద్యుత్ రంగం సుస్థిరాభివృద్ధి దిశగా చేపట్టాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాల విద్యుతశాఖ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్లో విద్యుత్ రంగ సంస్కరణలపై వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రుల 4వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యస్సో నాయిక్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో కీలక సంస్కరణల అమలుకు నాంది పలికినట్లు స్పష్టం చేశారు.
కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యస్సో నాయిక్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి, యాజమాన్య, నిర్వహణ సమస్యలను అధిగమించడానికి సమన్వయంతో సంస్కరణలు చేపట్టడం ఆవశ్యకమన్నారు. దీని కోసం రెగ్యులేటరీ సంస్కరణలు, రుణ పునఃరూపకల్పన, పునరుత్పాదక విద్యుత్ ఇంటిగ్రేషన్, విద్యుత్ స్టోరేజి పరిష్కారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా టారిఫ్‌ల సమీక్ష తోపాటు ఏపీటీఈఎల్ లాంటి సంస్థలను శక్తివంతం చేయడం, టారిఫ్ ఆర్డర్లు, నెట్ మీటరింగ్ విధానాలను సరళీకృతం చేయడం లాంటి చర్యలను చేపట్టడం ద్వారా డిస్కంలను నష్టాల బారి నుంచి గట్టెక్కించవచ్చని సూచించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విస్తరణకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నారు.
రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ మాట్లాడుతూ రాజస్థాన్‌లో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 2025-26 నాటికి 36,700 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 77 లక్షల మందికి పైగా వినియోగదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడిరచారు.
మహారాష్ట్ర మంత్రి మేఘన సకోరే బోర్డికర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు తమ రాష్ట్రం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి అరవింద్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్‌కు తగిన విద్యుత్ పంపిణీి వ్యవస్థను నిర్మించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని ఇందుకు తక్కువ వడ్డీరేట్లతో ఋణం అవసరమని పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని, బొగ్గు కేటాయింపులను ఆచరణాత్మక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ రంగానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కోసం వ్యయాధారిత టారిఫ్ విధానం అనివార్యమని స్పష్టం చేశారు. అదే విధంగా ఆర్థిక భారం తగ్గించేందుకు డిస్కంలు చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర, వివిధ రాష్ట్రాల ఇంధనశాఖ ఉన్నతాధికారులు, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ ఏకేవీ భాస్కర్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.