- వ్యాపారులతో మాట్లాడి పొగాకు కొనుగోళ్లు పెంచుతాం
- రైతుల శ్రేయస్సుకు పొగాకు బోర్డు సహకరించాలి
- మంత్రి డోలా స్పష్టీకరణ
- ఒంగోలులో వేలం కేంద్రం సందర్శన
ఒంగోలు (చైతన్యరథం): పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి భరోసా ఇచ్చారు. మంగళవారం ఉదయం ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌తో కలిసి మంత్రి డోలా సందర్శించారు. ఈ సందర్బంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతులు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా విలేకరులతో మంత్రి డోలా మాట్లాడుతూ, ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.
లో గ్రేడ్ బేళ్లు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని, ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నో బిడ్లు, ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కూడా ధరలు లేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిరదన్నారు. ఇప్పుడు కూడా రైతుల నష్టపోకుండా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. పొగాకు రైతుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైసీపీ హయాంలో దళారులు బాగుపడి రైతులు నష్టపోయారని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల శ్రేయస్సుకు పొగాకు బోర్డు సహకరించాలని మంత్రి అన్నారు.