- ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు బుధవారం నుంచి మార్పు
- వచ్చిన వినతులు, పరిష్కరించిన వివరాలతో కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలి
- కార్యకర్తల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడి
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు శుక్రవారానికి మార్చారు. నియోజవర్గాల్లో స్వీకరించిన వినతులను.. అలాగే పరిష్కరించిన వాటి వివరాలపై తదుపరి వారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సమావేశాల లక్ష్యం కార్యకర్తల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం, వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించడంగా ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో బూత్‌స్థాయి నుంచి సంస్థాగత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ సమావేశానికి తప్పనిసరిగా ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి హాజరైన, హాజరు కాని వారి వివరాలను, అలాగే సమావేశం ముఖ్యమైన మినిట్స్‌ను కేంద్ర కార్యాలయానికి పంపించాలని. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.